10-12-2025 07:43:13 PM
ప్రజలు నిర్భయంగా నచ్చిన వారికి ఓట్లు వేయండి..
జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..
వనపర్తి (విజయక్రాంతి): వనపర్తి జిల్లాలో నిర్వహించనున్న మొదటి విడత 5 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణములో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయడం జరిగిందని, ప్రజలు తమ అమూల్యమైన ఓటును తమకు నచ్చిన అభ్యర్థికి వేసుకోవాలని జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు తలోగ్గకుండ, భయబ్రాంతులకు గురి కాకుండా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవాలని సూచించారు.బుధవారం గోపాల్పేట, ఏదుల మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయల ఆవరణంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.
ఎదుల మండలంలోని 11 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాలు, 100 వార్డు మెంబర్లు, గోపాల్పేట మండల పరిధిలో 13 సర్పంచి స్థానాలకు, 119 వార్డు మెంబర్లు, రేవల్లి మండలంలో 9 సర్పంచి, 78 వార్డు మెంబర్లు, పెద్దమందడి మండల పరిధిలో 22 సర్పంచి, 180 వార్డు మెంబర్లు , ఘనపూర్ మండల పరిధిలో 27 సర్పంచి, 198 వార్డు మెంబర్ల స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించేందుకు గాను పోలింగ్ సిబ్బంది మెటీరియల్ తీసుకొని తరలి వెళ్ళారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన వసతులను కలెక్టర్ పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రం ముందు ఫారం - 9 లో అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తు పోస్టర్ అతికించాలని సూచించారు. పోలింగ్ సిబ్బంది ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల మెటీరియల్, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లను తీసుకొని కేటాయించిన గ్రామ పంచాయతీకి రూట్ వారిగా బస్సులో తరలి వెళ్ళారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు మల్లయ్య బట్టు, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్, ఎంపీఓ తదితరులు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.