calender_icon.png 22 October, 2024 | 9:14 PM

పూజ పవర్

10-07-2024 01:57:36 AM

  • మూడో టీ20లో టీమిండియా జయభేరి
  • 1-1 సిరీస్ సమం

దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌తో పాటు ఏకైక టెస్టులో ఘన విజయం సాధించిన భారత మహిళల జట్టు.. పొట్టి సిరీస్‌ను ‘డ్రా’ చేసుకుంది. బౌలర్ల సమష్టి ప్రదర్శనకు ఓపెనర్ల దూకుడు తోడవడంతో మూడో టీ20లో హర్మన్‌ప్రీత్ బృందం ఘన విజయం సాధించింది. బంతితో పూజ వస్త్రాకర్, రాధ యాదవ్ విజృంభించగా.. బ్యాటింగ్‌లో స్మృతి మంధన, షఫాలీ వర్మ అదరగొట్టారు. 

చెన్నై: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో విజయ పతకా ఎగరవేసింది. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు ముందు మన అమ్మాయిలు సఫారీలపై చక్కటి ప్రదర్శన కనబర్చారు. మంగళవారం చెపాక్ స్టేడియంలో జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్ బృందం 00 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1 సమమైంది. అంతకుముందు వన్డే సిరీస్‌తో పాటు ఏకైక టెస్టులో మన అమ్మాయిలు విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు 17.1 ఓవర్లలో 84 పరుగులకు ఆలౌటైంది. తజ్మీన్ బ్రిట్స్ (20) టాప్ స్కోరర్ కాగా.. మిగిలినవాళ్లంతా విఫలమయ్యారు. గత రెండు మ్యాచ్‌ల్లో భారీ స్కోరు చేసిన సఫారీలకు ఆఖరి పోరులో మనవాళ్లు కళ్లెం వేశారు. భారత బౌలర్లలో పూజ వస్త్రాకర్ 4, రాధ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా 10.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 88 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (40 బంతుల్లో 54 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), షఫాలీ వర్మ (27 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడారు. పూజకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. 

సంక్షిప్త స్కోర్లు

దక్షిణాఫ్రికా: 17.1 ఓవర్లలో 84 ఆలౌట్ (బ్రిట్స్ 20; పూజ 4/13, రాధ 3/6),భారత్: 10.5 ఓవర్లలో 88/0 (స్మృతి 54 నాటౌట్, షఫాలీ 27 నాటౌట్).

జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత యువ జట్టు వరుసగా రెండో విజయంపై కన్నేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ జింబాబ్వేతో మూడో టీ20కి సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యులైన యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, సంజూ శాంసన్‌లు జట్టుతో కలవడంతో టీమ్ మరింత బలంగా తయారయ్యింది. జైస్వాల్ రాకతో టీమ్ మేనేజ్‌మెంట్‌కు కొత్త చిక్కువచ్చి పడింది. ఈ సిరీస్‌లో కెప్టెన్ గిల్ ఓపెనర్‌గానే బ్యాటింగ్ చేస్తానని ముందే చెప్పడం.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ రెండో టీ20లో సెంచరీతో కదం తొక్కాడంతో..  జైస్వాల్ కోసం ఎవరిని తప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది!