calender_icon.png 31 October, 2025 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు నష్ట నివారణపై జాగ్రత్తలు

31-10-2025 12:00:00 AM

మరిపెడ మండలం వ్యవసాయశాఖ అధికారి వీరాసింగ్

మరిపెడ, అక్టోబర్30 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా,మరిపెడ మండల కేంద్రంలో మోంథా తుఫాన్ సృష్టించిన బీభత్సంతో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు నేలకొరిగి నీళ్లలో నానుతూ ఉన్న పంటలకు తీవ్రమైన నష్టం వాటిల్లకుండా నివారణ చర్యలలో భాగంగా మరిపెడ మండల వ్యవసాయ శాఖ అధికారి, రైతులకు కొన్ని సూచనలు ఇచ్చారు. వాటిలో వరిపైరు  నేలకొరిగితే వరి పంట గింజ గట్టి పడే దశ, కోత దశలో ఉండటం వల్ల కింద పడిపోవచ్చు.

వరిపైరు నేలకొరిగితే ధాన్యం మొలకెత్త కుండా పొలం నుంచి మురుగు నీటిని వీలైనంత త్వరగా తీసివేయాలి. నేలకొరిగిన పంటను జడలుకట్టి నిటారుగా నిలబెట్టాలి. దాన్యం మొలకెత్త కుండా 5శాతం సోడియం క్లోరైడ్ (సాధారణ ఉప్పు) ద్రావణాన్ని పిచికారీ చేయాలి. భారీ వర్షాల నేపథ్యంలో పంటలకు ఎరువులు వేయవద్దు. వరి కోతలను వాయిదా వేసుకోవాలి. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని కుప్పగా చేర్చి టార్పాలిన్ కవర్లతో కప్పి ఉంచాలి. మొక్కజొన్న పంట పూత లేదా గింజ అభివృద్ధి దశలో పంటలు నేలకొరిగే అవకాశముంది.

మొక్కలను దగ్గరగా గట్టి ఒకదానికొ కటి ఆసరా ఉండేలా చేయాలి. పంట పొలాల్లో వర్షం నీరు నిలవ కుండా చూసుకోవాలి. కోతకు వచ్చిన మొక్కజొన్న పంటను వర్షం తగ్గే వరకు కోయకుండా వాయిదా వేయాలి. ఆరబెట్టిన గింజలను టార్పాలిన్ కవర్ల కింద కప్పి ఉంచాలి.పత్తి పంట తుపాను నేపథ్యంలో పత్తితీతను వాయిదా వేసుకోవాలని, మరిపెడ మండల వ్యవసాయ అధికారి భూక్యా వీరా సింగ్, రైతులకు పలు సూచనలు చేశారు.