calender_icon.png 1 November, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోపాలపురం చెరువు కోత ప్రభావిత ప్రాంతాల పరిశీలన

31-10-2025 10:32:58 PM

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ పరిధిలోని గోపాలపురం చెరువు కోత కారణంగా వివేక్ నగర్, అమరావతి నగర్,  తదితర కాలనీలు నీట మునిగిన నేపథ్యంలో శుక్రవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, అధికారుల బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో ఇంటి ఇంటికి తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా నీట మునిగిన ఇళ్లలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను స్వయంగా గమనించిన ఎమ్మెల్యే, ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా పాడవడంతో సుమారు రెండు అడుగుల మేర బురద పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలను చూశారు.

వెంటనే సంబంధిత అధికారులకు చెరువులోని నీటిని తక్షణం బయటకు పంపించే చర్యలు చేపట్టాలని, కాలనీలలో బురద తొలగింపు, చెత్త తొలగింపు, దుర్వాసన నివారణ చర్యలు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. అలాగే ప్రభావిత కుటుంబాలకు అవసరమైన ఆహారం, తాగునీరు, ఔషధాలు, తాత్కాలిక నివాస సదుపాయాలను అందించాలని సూచించారు. అనంతరం బాధితులను పరామర్శిస్తూ ప్రజలు ఆందోళన చెందకుండా ఉండాలని, ప్రభుత్వం మీతో ఉంది. ప్రతి బాధిత కుటుంబానికి తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటాం అని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. మున్సిపల్ అధికారులు, స్థానిక కార్పొరేటర్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.