31-10-2025 10:14:40 PM
రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా
హనుమకొండ,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలలో విద్యార్థులకు సకల మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్య బోధన అందించాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అన్నారు.శుక్రవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన సామాగ్రి కొనుగోలు చేయాలని, విద్యార్థుల అవసరాలు తీర్చే విధంగా సామాగ్రి నిర్వహణ చేపట్టాలని తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ పథకం కింద పాఠశాలలకు విడుదల చేసిన నిధులను వినియోగించి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ పద్ధతిలో బోధించడానికి వినియోగించే కంప్యూటర్లు, వాటి మరమ్మత్తులు చేపట్టాలని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు ముఖ గుర్తింపు ద్వారా హాజరు అమలు చేయాలని, ఆపార్/ఆధార్ సమాచారం ధృవీకరించాలని తెలిపారు.
ప్రత్యేక అవసరాలు గల పిల్లల కొరకు ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలలో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఓపెన్ పాఠశాలలకు సంబంధించి చేరికలు, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.ప్రభుత్వం ద్వారా నూతనంగా అమలు చేయబోయే అమ్మకు అక్షరమాల పథకం నిర్వహణపై అధికారులతో సమీక్షించారు.సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా విద్యా శాఖ అధికారి వాసంతి, డిఐఈఓ గోపాల్ సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.