calender_icon.png 8 May, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రమూల శిబిరాలు నాశనం చేయకుండా ఉగ్రవాదం అంతం చేయలేం

07-05-2025 12:26:52 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత రక్షణ దళాలు బుధవారం ఉదయం దాడులు చేశాయి. ఉగ్ర ఘటనలపై విదేశాంగశాఖ, రక్షణశాఖ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో దాడికి సంబంధించిన వీడియో ప్రదర్శన చేశారు. పహల్గాం ఘటనలో 26 మంది భారత పౌరులను పొట్టన పెట్టుకున్నారని విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. ఉగ్ర మూకలకు పాకిస్థాన్ అండగా నిలుస్తోందని, పహల్గాం ఉగ్రదాడి వెనక టీఆర్ఎఫ్ ఉందన్నారు. టీఆర్ఎఫ్ కు పాక్ అండదండలున్నాయని, లష్కరే తొయిబా, జైషే మహ్మద్ పై ఇప్పటికే నిషేధం ఉందని విక్రమ్ మిస్రీ తెలిపారు.

ఉగ్ర సంస్థలపై నిషేధం దృష్ట్యా టీఆర్ఎఫ్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తుందని, పహల్గాం ఉగ్రదాడి తమ పనేని టీఆర్ఎఫ్ ప్రకటించుకుందని తెలిపారు. ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయమిస్తోందని, పాక్ ఉగ్రమూల శిబిరాలు నాశనం చేయకుండా ఉగ్రవాదం అంతం చేయలేం అని మిస్రీ వ్యాఖ్యానించారు.  జమ్మూకశ్మీర్ ను అతలాకుతలం చేయడమే లక్ష్యంగా పహల్గాం దాడి అని, కొంతకాలంగా కాశ్మీర్ లో పర్యాటకం వృద్ధి చెందుతోందని చెప్పారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధిని అడ్డుకునేందుకు పహల్గాంలో అతి క్రూరంగా ఉగ్రదాడి జరిగిందని, పర్యాటకుల కుటుంబసభ్యుల కళ్ల ముందే కిరాతకంగా చంపారని విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు.

టీఆర్ఎఫ్ గురించి ఇప్పటికే భారత్ ఐరాసకు ఫిర్యాదు చేసిందని, ప్రత్యక్ష సాక్షుల వివరాల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు ఆయన మీడియా ముఖంగా తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాక్ చరిత్ర ప్రపంచానికి తెలిసిందే అని, ఉగ్రవాదంపై పోరులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిందని విక్రమ్ మిస్రీ వివరించారు. ఇవాళ తెల్లవారుజామున ఉగ్ర మూకల శిబిరాలపై భారత దళాలు దాడులు చేశాయని, సీమాంతర ఉగ్రవాదంపై పోరాటం భారత్ హక్కు అని ఆయన అభిప్రాయపడ్డారు.