12-08-2025 04:28:41 PM
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లా పరిధిలో శిశు మరణాలను పూర్తిగా నివారించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, ఆశా కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్(District Collector Jitesh V. Patil) ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ట్రైనీ కలెక్టర్ శ్రీ సౌరభ్ శర్మతో కలిసి శిశు మరణాల పర్యవేక్షణ, ప్రతిస్పందన కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ సంవత్సరం జిల్లాలో నమోదైన 7 శిశు మరణాలపై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా వైద్య అధికారులు, వైద్య నిపుణులు, ఫీల్డ్ సిబ్బంది సమగ్ర సమీక్ష నిర్వహించారు. మరణాలకు గల కారణాలను విశ్లేషించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి ప్రాణం అమూల్యమని, సమయానికి తీసుకునే జాగ్రత్తలు శిశువుల ప్రాణాలను కాపాడగలవన్నారు.మహిళలు గర్భం దాల్చిన నాటి నుండి ప్రసవం వరకు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు సమయానికి చేయించుకునేలా గ్రామస్థాయిలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తరచుగా గర్భిణీల ఇళ్లను సందర్శించాలి. రక్తహీనత నివారణకు పౌష్టికాహారం, అవసరమైన మందులు అందేలా చూడాలి. అంగన్వాడి సిబ్బంది పౌష్టికాహారంపై మార్గదర్శకాలు ఇవ్వడంతో పాటు గర్భిణీల రిజిస్ట్రేషన్, ఆరోగ్య వివరాలను సక్రమంగా నమోదు చేయాలి. హై రిస్క్ గర్భిణీలకు ప్రత్యేక పర్యవేక్షణ, సమయానికి వైద్య సేవలు అందించాలి. గిరిజన, గుత్తికోయల ప్రాంతాల్లో పిల్లల ఆరోగ్యం, తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా నిమోనియాపై అవగాహన కల్పించేందుకు వారికి అర్థమయ్యే విధంగా వీడియోలు, కార్యక్రమాలు రూపొందించాలని ఆదేశించారు.
స్థానిక వెదురు వంటి వనరులను వినియోగించి ఆరోగ్య సంరక్షణకు అనువైన వస్తువులు తయారు చేసే శిక్షణ ఇవ్వాలని సూచించారు. శిశువులకు మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలు అందించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని, దీనిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. శిశు మరణాల నియంత్రణకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, విధానాల అమలు, వైద్య సేవలు అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశం అనంతరం జిల్లా వ్యాప్తంగా క్షయవ్యాధి(టీబీ) నివారణ అవగాహన కోసం రూపొందించిన గోడపత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య శాఖ అధికారి జయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, వైద్య నిపుణులు, వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.