calender_icon.png 18 August, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దామెరవాయిలో ఆదిమానవుల సమాధులు

11-12-2024 12:00:00 AM

దక్కన్ గోదావరి లోయలో మెసోజాయిక్ యుగం నుంచి మెగాలిథిక్ యుగం వరకు అన్నిరకాల మానవజీవన సాంస్కృతిక ఆధారాలు లభిస్తున్నాయి. ప్రత్యేకించి తెలంగాణలో బృహత్సిలలు ప్రత్యేక వర్గానికి చెందినవి. అన్నిరకాల మెగాలి థిక్ మాన్యుమెంట్స్ మెన్హర్లు, రాతివృత్తాలు, డోల్మ న్లు, డోల్మనాయిడ్ సిస్తులు తెలంగాణలోని వందలా ది గ్రామాల్లో అగుపిస్తున్నాయి. ఎక్కడాలేని ప్రత్యేకమైన శిలువాకారపు ఏకశిలలు స్త్రీ, పురుషాకారాలలో విగ్రహ శిలలు వరంగల్ జిల్లాలో మల్లూరుగుట్ట, దామెరవాయి, ఖమ్మం జిల్లాలో గలభా, కాంచనపల్లిలలో కనిపిస్తున్నాయి. 

తెలంగాణలో లభించే మెగాలిథిక్ మాన్యుమెంట్స్‌లన్నింటి వయస్సును క్రీ.పూ.1800 సం.ల నుంచి క్రీ.శ. 200 సం.ల మధ్యకాలంగా పురావస్తుశాఖవారు నిర్ధారిస్తున్నారు. గోదావరి లోయలోని బాసర నుంచి భద్రాచలం వరకు ప్రాచీన మానవావాసాలు, ఫాసిల్స్, సరీసృపాల గురించి పురావస్తుశాఖవారు అరవైల నుండే సర్వేలు, పరిశోధనలు చేసినట్లు వారి రిపోర్టుల వల్ల తెలుస్తున్నది. ప్రస్తుతం దామెరవాయిలోని డోల్మన్ల పరిరక్షణకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారని వినికిడి.

ఈ డోల్మన్ సమాధులు (గూడు సమాధులు) ప్రపంచవ్యాప్తంగా వున్నాయి. వీటిని నేలమీద, గుట్టలమీద నిర్మించారు. తెలంగాణ అంతటా వున్న డోల్మ న్లకు దామెరవాయి, మల్లూరు, జానకంపేటలలోని డోల్మన్లు భిన్నమైనవి. వీటి నిర్మితిలో బాగా తేడావుంటుంది. దామెరవాయిలోని సూరకుండయ్యగుట్టగా పిలువబడే చిన్నరాతిగుట్ట మీద దాదాపు 120కిపైగా డోల్మన్లున్నవి. ప్రతి డోల్మన్ మొదట 30 అడుగుల వ్యాసంతో, వృత్తాకారంలో 2,3 అడుగుల ఎత్తున్న దీర్ఘ చతురస్రాకారపు మందపురాళ్ళ తో కట్టి, పెద్దరాతిముక్కలను పరిచిన వేదికమీద నాలుగు వైపుల నిలిపిన అడుగుమందం రాతిపలకలతో ఎక్కువ మట్టుకు 10 అ.ల పొడవు, 8.8 అ.ల వెడల్పులతో దీర్ఘచతురస్రాకారంలో కట్టిన రాతిగూటికి చతుర స్రాకారపు రాతిపలకతో మూసేవిధంగా ఉత్తరం వైపు రాతిపలకకు మధ్యలో ద్వారం వుంది.

మూతరాతి పలకలు కొన్నిచోట్ల తొలగించి వున్నవి. రాతిగూటికి వాడిన పైకప్పు రాయి 12అ. వెడల్పు, 15అ. పొడవులతో ఒకటిన్నర, రెండు అడుగుల మందం కలిగి వుంది. గూడులోపల రాతిగోడ ఎత్తు 2.3 అ.లు. పరిశీలించిన 30 సమాధులలో 10 సమాధులలో ఒక్కో దానిలో నాలుగు రాతి తొట్లున్నవి. ప్రతి రాతితొట్టి చక్కగా చెక్కబడింది. రాతితొట్టి బయటిపొడవు 6.75 అ.,వెడల్పు 1.16 అ.లు. లోపలివైపు 5.72 అ.ల పొడవు, వెడల్పు 9.6 అంగుళాలు.

ఈ రాతి గూళ్ళలోని ఆ రాతితోట్లలో చనిపోయిన మనుషుల అస్థికల నుంచి రాతిగూడును మూసివుంచేవారేమో. మానవ మృత కళేబరాలను వీటిలో పెట్టినట్లుగా ఆధారాలేమి దొరకలేదు. పూర్తి కళేబరాలను ఈ రాతి తొట్లలో వుంచడానికి అనువుగా లేవు. లేదా శవాలను నలగగొట్టి వీటిలో వుంచడానికి వీలవుతుంది. ఈ రాతి గూళ్ళల్లో దేనిలోను కుండలు పనిముట్లు కనిపించలేదు. 

రాతి పనిముట్లు అన్నీ బరువైనవి, అంతగా నునుపు చేయనివి కొన్ని అండాకారపు రాళ్ళు, గొడ్డలి వంటివి, బోరర్లు, స్క్రాపర్లు దొరుకుతున్నవి. వాటిలో ఎక్కవగా క్వార్జుటై, సానపురాళ్ళు, ఇసుకరాళ్ళు, ఎరుపు రంగు చెకుముకిరాళ్ళతో చేసిన పనిముట్లు దొరికాయి. ఈ రాతిగూళ్ళ నిర్మాణంలో వాటి కొలతలు, దిశలు, వృత్తాకారపు సమాధుల పరిధి, రాళ్ళను చీల్చిన పనితనం అప్పటి మనుషుల నిర్మాణనైపుణ్యాలను, బుద్ధికుశలతను నిరూపిస్తున్నవి.

మేం గుట్టను గ్రామం వైపు నుండి పడమటి నుండి పైకెక్కి గుట్ట తూర్పు అంచుదాక వెళ్ళాం. తూర్పువైపున వాలుకు పరుపు బండలున్నవి. వాటిమీద శిలువ ఆకారంలో రాతిని తొలవడానికి వేసుకొన్న కొలతల గీతలు, సగం చెక్కిన శిలువరా ళ్ళున్నవి. మాకు శిలువరాతి సమాధులకు సిద్ధం చేస్తున్న రాతిజాడలు దొరికాయి. కాని శిలువ సమాధులు దొరకలేదు. గుట్టకు తూర్పున వాగున్నదని, అక్కడ కూడా సమాధులున్నవని, దట్టంగా అడవున్నకారణంగా వెళ్ళడానికి సర్పంచ్ మమ్మల్ని వెళ్ళొద్దని ఆపాడు. ఆ వైపున శిలువసమాధులుండవచ్చని ఆశతో వెనుదిరిగాం.

కొసమెరుపు: దామెరవాయి గ్రామం నుండి గుట్టవైపు పోతున్నపుడు అక్కడ కనిపించిన రాళ్ళలో ఇనుమున్నట్లు కాలినరాళ్ళు ముద్దలుకట్టి వుండడం, చిట్టెం దొరకడం బట్టి తెలుస్తున్నది. దారిలో సూరకుండయ్య దేవున్ని చూడమని గ్రామస్తులు తోడొచ్చి చూపించారు. వినాయక విగ్రహాన్నే సూరగుండయ్య అంటున్నారు వీళ్ళు. వినాయకునికి సూరగుండయ్యనే పేరు రావడం వెనక కథేమిటో. వాళ్ళ పొలాల నడుమ పాటిగడ్డవున్నట్టు, ఒకచోట గుడిరాళ్ళుండెనని చెప్పారు. బహుశ ఈ గణపతి ఆ గుడిలోని వాడేనేమో. దామెరవాయి గుత్తికోయల వూరు. సర్పంచ్ గుత్తికోయే. వాళ్ళు సమ్మక్క,సారక్కల జాతరకంటె ముందుగనె పుష్యమాసం పున్నమికి ఈ గుట్టకే ఎద్దును కోసి పండుగ చేసుకునే వాళ్ళట.

కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులం- నేను (శ్రీరామోజు హరగోపాల్), వేముగంటి మురళీకృష్ణ, సహాయకుడు చంటి, అరవింద్ ఆర్యలతో కలిసి వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం దామెరవాయిలోని సూరగుండయ్యగుట్ట మీదున్న డోల్మన్ సమాధులను సందర్శించడానికి వెళ్ళినపుడు దామెరవాయి సర్పం చ్ మావెంటే వుండి సహకరించాడు. గ్రామస్తులు కూడా ఆదరించారు. 

-శ్రీరామోజు హరగోపాల్