11-12-2024 12:00:00 AM
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండ లం ఉమ్మాపూర్ పాటిగడ్డమీద వేలయేండ్లనాటి మానవ నాగరికత, సంస్కృతికి సంబంధించిన వస్త్వాధారాలు లభిస్తున్నాయి. చరిత్ర పరిశోధకులు చారిత్రక విశేషాలను పరిశీలిస్తుండటంతో అప్పటి చరిత్ర వెలుగుచూస్తోంది. కొద్దిరోజుల క్రితం కొత్తతెలంగాణ చరిత్ర పరిశోధక బృందం సభ్యుడు అహోబిలం కరుణాకర్ గ్రామ పాటిగడ్డమీద చరిత్ర ఆనవాళ్ల ను పరిశోధిస్తుండగా పురామానవులు వాడిన మొద్దుకత్తి దొరికింది.
పదివేల ఏండ్ల నాటి కొత్తరాతి యుగానికి చెందిన మానవులు వాడిన పనిముట్టుగా దీనిని గుర్తించారు. అది పది అంగుళాల పొడ వు, ఏడు అంగుళాల వెడల్పుతో ఉంది. ఆ రాతి మొద్దుకత్తికి పదునైన అంచుతోపాటు పట్టుకోవడానికి పిడికిలి ఉంది. ఆ వస్తువు మెసపుటేమియా నాగరికతకు సంబంధించిన వస్తువులను పోలి ఉందని చరిత్ర పరిశోధకులు అంటున్నారు. ఉమ్మాపూర్‌లో దొరికిన ఆ మొద్దుకత్తి పురాసంబంధాలను గుర్తుచేసేవిధంగా ఉందని చెబుతున్నారు.
ఆ మొద్దుకత్తితో అప్పటి మానవులు వేటాడిన జంతువులను కోసుకొని, ముక్కలుగా నరికి తినడానికి వాడేవారని కొత్తతెలంగాణ పరిశోధక బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. ఆనాటి అనేక పనిము ట్లలో ఆ మొద్దుకత్తి ఒకటని చెప్పారు. ఇలాంటి రాతియుగాల పనియుట్లు తెలంగాణ ప్రాక్ చరిత్రకు ఆధారాలుగా నిలు స్తున్నాయన్నారు. కఠిన ప్రదేశాల్లో ఇలాం టి పనిముట్లు లభిస్తాయని చెప్పారు. మొద్దుకత్తి అభించిన కొద్ది దూరంలోనే పెదరాతియుగం నాటి సమాధులు కూడా ఉన్నాయని కరుణాకర్ తెలిపారు. అక్కడ మరిన్ని తవ్వకాలు జరిపితే మరిం త చరిత్ర వెలుగుచూసే అవకాశం ఉంది.
అమ్మదేవత, వీరగల్లులు ఏం చెప్తున్నయ్?
ఉమ్మాపూర్ సమీపంలో ఒక రాతిగుండు మీద చాముండి దేవతా శిల్పముంది. ఆసన స్థితిలో ఉన్న ఈ దేవత చతుర్భుజా లు కలిగి ఉంది. వెనుక చేతుల్లో ఢమరు కం, త్రిశూలం ఉన్నాయి. ముందు చేతు ల్లో ఖడ్గం, రక్తపాత్ర ధరించి ఉంది. ఆమె ఆసనంమీద మూడు ఖండిత శిరస్సులు ఉన్నాయి.. ఈ దేవతకు కుడివైపు ఒక వీరుడు గుర్రం మీద స్వారీ చేస్తూ, ఈటె తో అడవిపందిని చంపుతున్నాడు. వీరుని తలపై గొడుగు పట్టుకొని వెనుక బంటు ఉన్నాడు. ఇది వీరుని రాచహోదాను సూచిస్తోంది. గుర్రంతోపాటు అతని వేటకుక్క ఉంది.
ఈ శిల్పాలలో దేవతకు ఎడమచేతి వైపున కూడా విల్లమ్ములు ధరించి వేటాడుతున్న మరొక వీరుడి బొమ్మ ఉంది. ఇక్కడ రాతిగుండుమీద శిల్పాల కింద తెలుగులో శాసనం ఉంది. మనకు హరప్పా తవ్వకాలలో లభించిన టెర్రకోట బొమ్మల్లో అమ్మదేవతలు, జంతువులు ఉన్నాయి. అందువల్ల ఈ ప్రాంతంలో లభించిన పురామానవుల వస్త్వాధారాలకు మెసపుటేమియా నాగరికతకు సంబంధించిన వస్త్వాధారాలకు పోలికలు ఉంటాయని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు.
-మేకల ఎల్లయ్య, హుస్నాబాద్