23-10-2025 12:57:53 AM
నవంబర్ 1 లోగా రూ.900 కోట్లు విడుదల చేయాలని డిమాండ్
3 నుంచి కాలేజీలు బంద్ చేస్తామని అల్టిమేటం
హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి ప్రైవేట్ విద్యాసంస్థల సమాఖ్య నాయకులు సమ్మె నోటీసులిచ్చారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బుధవారం కలిసి నోటీసులు అందజేశారు. రూ.1200 కోట్లలో ఇప్పటి వరకు రూ.300 కోట్లే విడుదల చేశారని, మిగిలిన రూ.900 కోట్లు నవంబర్ 1 వరకు విడుదల చేయాలని, లేకుంటే అదే నెల 3నుంచి ఇంజినీరింగ్‌తో సహా అన్ని ప్రొఫెషనల్, డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్ నిర్వహిస్తామని నోటీసులో పేర్కొన్నట్లు ప్రైవేట్ విద్యాసంస్థల నాయకులు తెలిపారు.
డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో ప్రైవేట్ విద్యాసంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు, సెక్రటరీ జనరల్ ఎస్.రవికుమార్, ట్రెజరర్ కృష్ణారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సునిల్ కుమార్ ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రైవేట్ ఫార్మసీ, బీఎడ్ కాలేజీల గౌరవాధ్యక్షుడు రాందాస్‌తో పాటు పలువురు మంత్రి ఉత్తమ్‌ని సూర్యాపేటలో కలిసి సమ్మె నోటీసులందించారు.