calender_icon.png 24 October, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిగ్‌బాస్ షోను తక్షణమే రద్దు చేయాలి

23-10-2025 11:48:29 PM

ఈ విషయమై హైకోర్టులో ఫీల్ దాఖలు చేస్తాం..

సామాజిక కార్యకర్తలు కమ్మల శ్రీనివాస్, రవీందర్ రెడ్డి..

ముషీరాబాద్ (విజయక్రాంతి): అధర్మమైన పద్ధతిలో నడుస్తున్న బిగ్‌బాస్ షోను తక్షణమే నిషేధించాలని పలువురు సామాజిక కార్యకర్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిగ్‌బాస్ షో గ్రామీణ ప్రాంతాల ప్రజలు యువతి యువకులపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సామాజిక కార్యకర్తలు కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, శ్రీలాన్, శ్రీనివాస్, బాల్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ బిగ్ బాస్ షో అధర్మమైన షో అని, దీనిపై ధర్మ పోరాటం చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ షోలో కనబరుస్తున్న అసభ్యకరమైన సన్నివేశాల వల్ల చిన్న చిన్న పిల్లలు ఖరాబ్ అవుతున్నారని, ఈ షో భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా సన్నివేశాలు ఉన్నాయని వారు అన్నారు.

యువతీ యువకులు తప్పిదారిన పడుతున్నారని పేర్కొన్నారు. సినిమా రంగంలో మంచి పేరు ఉన్న అక్కినేని నాగార్జున ఇలాంటి బిగ్‌బాస్ షోలో అసభ్యకరమైన సన్నివేశాలు చూపడం సరైనది కాదన్నారు. ఈ విషయమై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అదే విధంగా ఈనెల 21న హైదరాబాద్ సిపి సజ్జనార్, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని  వారు తెలిపారు. బిగ్ బాస్ షోను రద్దు చేసేంతవరకు మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, యువజన సంఘాలను కూడగట్టుకొని ఉద్యమం చేస్తామని వారు హెచ్చరించారు. బిగ్ బాస్ షోను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ఫీల్ దాఖలు చేయనున్నట్లు వారు వెల్లడించారు. బిగ్బాస్ షో పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.