24-10-2025 12:36:53 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 23 (విజయక్రాంతి): మా దైవాన్ని, ధర్మాన్ని కాపాడుకుంటుంటే హిందువుల సహనానికి హద్దులు పెడుతున్నారు. మా సహనాన్ని పిరికితనంగా భావిస్తే ఖబడ్దార్.. అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ర్ట ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోచారం కాల్పుల ఘటనలో పోలీసులు చెబుతున్నదంతా అబద్ధమని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో లబ్ధి పొందేందుకే ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి గోరక్షకుడిపై దుష్ర్పచారం చేయిస్తోందని ఆయన ఆరోపిం చారు.
గోవధ చట్టాన్ని అమలు చేయడంలో విఫలమైన పోలీసులు, ఆ పని చేస్తున్న సోనూ సింగ్‌పైనే అభాండాలు వేయడం దుర్మార్గమన్నారు. మేడ్చల్ జిల్లా పోచారం కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడి సికిందరాబాద్ యశో దా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోరక్షకుడు సోనూ సింగ్ అలియాస్ ప్రశాంత్ సింగ్‌ను గురువారం రాజ్యసభ సభ్యులు డా.కె. లక్ష్మణ్, బీజేఎల్పీ ఉప నాయకుడు పాయల శంకర్‌లతో కలిసి బండి సంజయ్ పరామర్శించారు.
సోనూ సింగ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ గోరక్షకుడిపై కాల్పులు జరిపిన ఎంఐఎం నేత ఇబ్రహీంకు రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చిం దో ప్రభు త్వం చెప్పాలన్నారు. గోవులను వధించడం తప్పని చెప్పకుండా, గన్ ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చకుండా నిందితుడికి వత్తాసు పలుకుతారా.. అని మండిపడ్డారు. పోలీసులు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించు కుని సీఎం, డీజీపీ తక్షణమే క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కూ..
గతంలో యాగాలకు ముందు గోపూజలు చేసిన కేసీఆర్, గోవధ చట్టాన్ని అమలు చేయలేదని, అందుకే ఆయనకు పాపం తగిలి ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. అదే బాటలో నడుస్తున్న ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంతకంటే హీనమైన గతి పడుతుందని హెచ్చరించారు. ఈ ప్రభుత్వంలో మంత్రులే కొట్లాడుకుంటున్నారు. అసలు ఈ సర్కార్ నిలబడుతుందో, కుప్పకూలుతుందో తెలియని పరిస్థితి రాష్ర్టంలో ఉందని విమర్శించారు.
భజరంగ్‌దళ్ చేతులు ముడుచుకుని కూర్చోదు
గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తే ముస్లిం ఓట్లు పోతాయనే భయంతోనే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయని ఆయన ఆరోపిం చారు. ప్రభుత్వం, పోలీసులు చేయాల్సిన పనిని చేతులెత్తేస్తే, ఆ పని చేస్తున్న భజరంగ్‌దళ్ కార్యకర్తలు చట్టానికి లోబడే గోమాతలను రక్షిస్తున్నవారిపై దాడులు చేయడం దారుణమన్నారు. ఇకనైనా గోవులను వధించే వారిని పట్టుకోకపోతే భజరంగ్‌దళ్ కార్యకర్తలు చేతులు ముడుచుకుని కూర్చోరని హెచ్చరించారు. సోనూ సింగ్ వైద్యానికి అయ్యే ఖర్చును పార్టీయే భరిస్తుందని, అతనికి అన్ని విధాలా అండగా ఉంటామని బండి సంజయ్ భరోసా ఇచ్చారు.