24-10-2025 12:28:35 AM
మూసీ ఉగ్రరూపానికి కూలిన 40 ఏళ్ల వారధి
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పోటెత్తిన మూసీ వరదలకు తీవ్రంగా దెబ్బతిని, శిథిలావస్థకు చేరిన మూసారాంబాద్ వంతెనను జీహెచ్‌ఎంసీ అధికారులు గురువారం కూల్చివేశారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా లక్షలాది మంది రాకపోకలకు ఆధారంగా నిలిచిన ఈ వంతెన ప్రస్థానం ముగిసింది. మూసారాంబాగ్ వద్ద మూసీ నదిపై ఉన్న ఈ పాత వంతెన, ఇటీవల వచ్చిన వరదల ఉధృతికి తట్టుకోలేకపోయింది.
వంతెన పిల్లర్లు బలహీనపడటం,కొన్ని చోట్ల పెద్ద పగుళ్లు రావడం, రెయిలింగ్ ఊడిపోవడం, కాంక్రీట్ పెచ్చులూడి ఇనుప చువ్వలు బయటకు తేలడంతో అది అత్యంత ప్రమాదకరంగా మా రింది. దీంతో జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఈ వంతెన ఏమాత్రం సురక్షితం కాదని నిర్ధారించి కూల్చివేశారు. పాత వంతెన స్థానంలోనే, కొత్తగా ఆరు వరుసల హై-లెవల్ వంతెన నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.