calender_icon.png 24 October, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక చైతన్య రథయాత్ర

24-10-2025 12:04:12 AM

  1. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా..
  2. అణగారిన వర్గాల ఏకత్వంతోనే రాజ్యాధికారం
  3. దిలీప్ కుమార్ యాత్రకు ఈటల రాజేందర్, విమలక్క సంఘీభావం

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 23 (విజయక్రాంతి): రాష్ర్టంలో 90 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ బహుజన వర్గాలు ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని, ఆ సామాజిక చైతన్యం తీసుకురావడానికే ఈ రథయాత్ర చేపట్టినట్లు రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ సాధన కోసం ఆయన చేపట్టిన సామాజిక చైతన్య రథయాత్రను గురువారం గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించి ప్రారంభించారు.

ఈ యాత్రకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజ్ గౌడ్ తదితరులు హాజరై సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ, రాష్ర్ట జనాభాలో 85 -90% ఉన్న బడుగు బలహీన వర్గాలకు అధికారంలో సరైన వాటా దక్కడం లేదని, అగ్రవర్ణాల పెత్తనమే కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పదేళ్ల కేసీఆర్ పాలనలో ఒకే కుటుంబం దోచుకుంటే, ఇప్పుడు వచ్చిన పది నెలల కాంగ్రెస్ పాలనలో ఊరికొకరు తయారయ్యారు. ఈ దోపిడీని అరికట్టాలంటే యువత రాజకీయాల్లోకి రావాలి, బహుజన ఓట్లు చీలకుండా ఉండాలి అని పిలుపునిచ్చారు.ఈ యాత్రకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ నాలుగు తరా లు పోరాడి సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం జరగలేదన్నారు.

తెలంగాణ అంటే బడుగుల రాష్ర్టం, అణగారిన వర్గాలకు నిలయం. కానీ, వారి చేతికి రాజ్యాధికారం అందలేదు. దోచుకునే వాళ్లకే అధికారం దక్కుతోంది. ఈ నేపథ్యంలో సామాజిక చైతన్యం కోసం దిలీప్ కుమార్ చేస్తున్న యాత్రకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఈ యాత్ర విజయవంతం కావాలి అని ఆకాంక్షించారు.

కులరహిత సమాజం కోసం పోరాటం: విమలక్క 

అరుణోదయ విమలక్క మాట్లాడుతూ దిలీప్ కుమార్ కులరహిత సమాజం కోసం, సామాజిక తెలంగాణ కోసం పనిచేస్తున్న వ్యక్తి అని కొనియాడారు. అందరం కలిసి మలిదశ తెలంగాణ ఉద్యమంలో పనిచేశాం. ఇప్పుడు మళ్లీ సామాజిక తెలంగాణ కోసం ఆయన యాత్ర చేస్తుంటే మేమంతా అండగా ఉంటాం, అని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా ఆమె పాడరా పాడరా మన పాట.. నవ తెలంగాణమని ప్రతి నోట.. అనే పాట పాడి యాత్రకు ఉత్తేజం నింపారు.ఈ రథయాత్ర జోగులాంబ నుంచి ఆదిలాబాద్ వరకు సాగుతుందని, తొలిదశ వరంగల్‌లో ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.