23-10-2025 12:56:12 AM
ఇప్పటి వరకు అందిన దరఖాస్తులు 90,316
హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): మద్యం దుకాణాలకు పెంచిన గడ వుతో మరిన్ని దరఖాస్తులు దాఖలయ్యాయి. మరొక్క రోజు (గురువారం) మిగిలి ఉంది. బుధవారం నాటికి 90,316 దరకాస్తులు వచ్చినట్టుగా ఎక్సైజ్ శాఖ తెలిపింది. మొత్తం 2,620 మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తుల దాఖలుకు ఈనెల 18 వరకే ఆఖరు అని మొదట్లో ప్రకటించారు. అయితే ఆరోజు నాటికి కేవలం 89,344 దరకాస్తులే వచ్చాయి.
పైగా దీపావళి, 18 నాడు బీసీ బంద్, వాహనాలు నిలిచిపోవడం, బ్యాంకులకు సెలవు కారణంగా గడువు పెంచాలనే డిమాండ్ వచ్చింది. పరిస్థితులను పరిశీలించిన ప్రభుత్వం ఈనెల 23 వరకు గడవును పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈనెల 20 దీపావళి సెలవు కారణంగా.. ఈనెల 21 నుం చి తిరిగి దరఖాస్తులు స్వీకరించారు. మంగళవారం 461 దరఖాస్తులు, బుధవారం 511 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.
దీనితో బుధవారం నాటికి మొత్తం 90,316 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా రూ.2,709.48 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే దరఖాస్తు ధర రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచడంతో దరఖాస్తుల సంఖ్య తగ్గింది. గురువారం చివరి రోజున దరఖాస్తులు దాఖలు చేయడానికి వీలుగా అన్ని జిల్లాల్లో ప్రొహిబిషన్ కార్యాలయాల్లో డివిజన్ల వారీగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. చివరి రోజు కావడంతో రద్దీ ఉంటుందని భావిస్తున్నారు.