calender_icon.png 8 September, 2025 | 1:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

యూరియా విక్రయాల్లో ప్రైవేట్ వ్యాపారుల చేతివాటం?

08-09-2025 10:25:10 AM

మహబూబాబాద్ (విజయక్రాంతి): యూరియా కొరతను ప్రైవేటు ఎరువుల డీలర్లు కొందరు తమకు అనుకూలంగా మలచుకొని, అధిక ధరలకు రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా యూరియాను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) నెల్లికుదురులో ఇదే తరహాలో ఇటీవల ఓ షాపు యజమాని తనకు వచ్చిన యూరియాను రాత్రికి రాత్రే విక్రయించుకోగా అధికారులు ఆ షాపు యజమానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. అలాగే ఇటీవల కూడా ఇదే తరహాలో మరో షాపు యజమాని తనకు వచ్చిన 200 పైగా యూరియా బస్తాలను తనకు అనుకూలమైన వారికి బస్తాకు 50 రూపాయలు అధికంగా తీసుకొని ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఓ ఎరువుల విక్రయ కేంద్రం నుంచి అధికారులకు సమాచారం ఇవ్వకుండా యూరియా బస్తాలను విక్రయిస్తుండగా కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి నిబంధనలకు విరుద్ధంగా ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో యూరియా విక్రయిస్తున్నట్లు గుర్తించి, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఓవైపు యూరియా కొరత అధికారులకు పెద్ద తలనొప్పిగా మారగా, సహకరించాల్సిన ప్రైవేట్ ఎరువుల డీలర్లు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తమకు కేటాయించిన యూరియాను అధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాత పంపిణీ చేయాల్సి ఉండగా, రాత్రిపూట అది కూడా అధికారులకు సమాచారం ఇవ్వకుండా విక్రయించడం విమర్శలకు తావిస్తోంది.