calender_icon.png 5 August, 2025 | 11:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి

05-12-2024 10:46:17 PM

 విద్యా కమిషనర్ మెంబర్ ప్రొఫెసర్ విశ్వేశ్వర్‌ రావు

కరీంనగర్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టల్ల విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని విద్యా కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వర్‌రావు అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లాలోని పలు పాఠశాలలు, హాస్టళ్లను ఆయన సందర్శించారు. పిల్లలకు అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనం, స్నాక్స్‌ను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని పిల్లలకు అందించాలన్నారు. శుభ్రమైన మంచినీటిని అందుబాటులో ఉంచాలన్నారు. 15 రోజులకు ఒకసారి వాటర్ ట్యాంకులను శుభ్రపరచాలని తెలిపారు.

వంట పాత్రలను వంట చేసే ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పేర్కొన్నారు. బయట నుంచి వచ్చే ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్టల్‌లోకి అనుమతించరాదని తెలిపారు. హాస్టల్లో వేడి నీరు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ అవసరమైన మేరకే ఆహార సరుకులను ఇండెంట్ సమర్పించాలని విద్యాధికారులను ఆదేశించారు. శీతకాలం నడుస్తున్నందున ఎక్కడైనా గీజర్లు పాడైతే వెంటనే మరమ్మత్తులు చేయించాలని పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని అన్నారు. హాస్టళ్లకు నాణ్యమైన సరుకులను ఎంపిక చేశామని, సరఫరాదారు నాసిరకం సరుకులు సప్లు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, జిల్లా విద్యాధికారి జనార్ధన్‌రావు, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి అనిల్ ప్రకాశ్, బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, మండల విద్యాధికారులు పాల్గొన్నారు.