calender_icon.png 5 August, 2025 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో ఎమ్మెల్యేలకే మాట్లాడే హక్కు లేకుండా పోయింది

05-12-2024 10:49:27 PM

సంవత్సరకాలంలో ఇన్ని నిబంధనలు, నిర్బంధాలా

మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్

 కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ నిరసన

కరీంనగర్,(విజయక్రాంతి): పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్టంలో ఎమ్మెల్యేలకు మాట్లాడే హక్కు లేకుండా పోయిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిల అరెస్టుకు నిరసనగా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన సంవత్సరకాలంలోనే ఇన్ని నిబంధనలు, ఇన్ని నిర్బంధాలా అని ప్రశ్నించారు. ఏనాడు ఇన్ని నిర్బంధాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఎమ్మెల్యేలకు మాట్లాడే హక్కు ఉందని, వారిని అరెస్టులు చేయడం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టులపై దృష్టి పెడితే జైళ్లు సరిపోవని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టుల మీద కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.