22-09-2025 09:02:18 PM
గ్రామ గ్రామాన ప్రచార కార్యక్రమాలు
మహబూబాబాద్,(విజయక్రాంతి): ఆయిల్ పామ్ పంట సాగు వల్ల ఇతర పంటలతో పోలిస్తే అధిక ఆదాయం పొందవచ్చని, సంప్రదాయ పంటల సాగుకు బదులు బోర్లు, బావులు కింద ఆయిల్ పామ్, ఉద్యాన, మల్బరీ, కూరగాయలు, మునగ వంటి మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు సాగు చేస్తే ఎకరానికి లక్షన్నర ఆదాయం పొందవచ్చని జిల్లా హార్టికల్చర్ అధికారి జినుగు మరియన్న తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని నరసింహులపేట, నెల్లికుదురు మండలాల పరిధిలోని పలు గ్రామాలను సందర్శించి రైతులకు పంట మార్పిడి ద్వారా ఆయిల్ పామ్ సాగు చేయాలని, మేలైన యాజమాన్య పద్దతులను వివరించారు.
ఆయిల్ పామ్ పంట సాగుకు ప్రభుత్వం ఎకరానికి అందించే మొక్కలు, బిందు సేద్యం, యాజమాన్యం, అంతర పంటలకు యాభై వేలు రాయితీ పొంది ఆయిల్ పామ్ తోటలు నాటాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి రైతు పొలం గట్ల మీద, పొలం చుట్టూ, పెరట్లో, ఆయిల్ పామ్, పండ్ల తోటలలో అంతర పంటలుగా, డాబాల మీద, ఇంటి ముంగిట రోజువారి కూరగాయల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, నూతన రకాల సాగు, ప్రో ట్రే లో నారు పెంపకం, ఎత్తు మడులు, మల్చింగ్, బిందు సేద్యం, ఫర్టిగేషన్, వేప పిండి, ఆముదం పిండి వాడకం, వేప నూనె పిచికారి చేయటం, పసుపు రంగు అట్టల వాడకం, సిఫారసు చేసిన ఎరువులు వాడటం, పందిరిపై కూరగాయల సాగు, ట్రెల్లిస్ మెథడ్ లో టమాటా సాగు మొదలైన పద్ధతులు పాటించాలన్నారు.