calender_icon.png 22 September, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా అటుకుల బతుకమ్మ వేడుకలు

22-09-2025 09:58:58 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): దసరా ఉత్సవాల్లో బతుకమ్మ మహిళా శక్తి ఐక్యతకు ప్రత్యేక అని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం  దసరా ఉత్సవాల భాగంగా రెండవ రోజు అటుకుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయాలు, సంస్కృతి స్ఫురించేలా బతుకమ్మల అలంకరణ, పాటలు, నృత్యాలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది. జిల్లా కలెక్టర్  జితేష్ వి. పాటిల్  ముఖ్యఅతిథిగా హాజరై, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ, బీసీ సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, మహిళా ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి బతుకమ్మ పూజలో పాల్గొన్నారు.బతుకమ్మ పాటలతో ప్రాంగణం అంతా మార్మోగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... “బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల ఆత్మీయత, సమైక్యతకు ప్రతీక. ఇది కేవలం పూల పండుగ మాత్రమే కాదు, మహిళల సాధికారతకు, సమాజంలో వారి పాత్రకు ప్రతీక అని అన్నారు. పూలతో తయారు చేసిన బతుకమ్మ ప్రకృతి సమతుల్యత, పర్యావరణ పరిరక్షణకు సూచిక అని, బతుకమ్మ పాటలు మన ఆత్మీయతను, పరంపరలను కొత్త తరాలకు చేరవేసే శక్తివంతమైన సాధనం అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తమ కృషి, ప్రతిభతో కుటుంబ అభివృద్ధి, ఆర్థిక స్వావలంబనలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇలాంటి సాంప్రదాయ పండుగలు మహిళల ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో పరస్పర ఐక్యతను బలపరచడంలో తోడ్పడతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత, గ్రామీణ అభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ దిశగా పలు చర్యలు చేపడుతోంది. అందులో బతుకమ్మ పండుగ ప్రత్యేక స్థానం కలిగి ఉంది అని, ప్రతీ ఒక్కరూ ఈ పండుగను పర్యావరణ హితంగా, సమైక్యతతో జరుపుకోవాలన్నారు. స్వచ్ఛతాహి సేవ- 2025లో భాగంగా స్వచ్ఛోత్సవ్-పక్షోత్సవాలులో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ లో అధికారులతో కలిసి కలెక్టర్ సెల్ఫీ ఫోటో దిగారు.