22-09-2025 09:38:23 PM
స్థానిక మట్టితో పర్యావరణ హిత నిర్మాణాలు
పశుసంవర్ధక అభివృద్ధికి మేకల షెడ్ల నిర్మాణం
స్థానిక జాతి మేకల పెంపుదలకు కొత్త ప్రణాళికలు
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): తమిళనాడు రాష్ట్రం పాండిచ్చేరి ఆరో వెళ్ళు ఎర్త్ ఇన్స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన తిరుపతయ్య (EC MGNREGS), కార్తీక్ (AE PR), హేమంత్ కుమార్ (AE Housing) సోమవారం కలెక్టర్ ను కలిశారు. శిక్షణలో నేర్చుకున్న ముఖ్య విషయాలను వివరించారు. ఈ శిక్షణలో పర్యావరణానికి హాని కలగకుండా, స్థానికంగా లభించే మట్టిని వినియోగించి గ్రామాల్లో అవసరాలకు అనుగుణంగా భవన నిర్మాణాలు చేయడం, అలాగే ఉపాధి హామీ కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాలను అభ్యసించారు.
ఈ విధానం ద్వారా మన జిల్లాలో లభించే మట్టిని వినియోగించి, పర్యావరణానికి అనుకూలంగా, ఉపాధి సృష్టించే విధంగా గ్రామపంచాయతీలలో అంగనవాడి భవనాలు, కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్సులు, ఎస్‌ఎస్‌జి వర్క్ షెడ్లు, కాంపౌండ్ వాల్లు, పశువుల పాకలు, మేకల/గొర్రెల పాకలు, పౌల్ట్రీ షెడ్లు వంటి నిర్మాణాలను చేపట్టాలని కలెక్టర్ శిక్షణ పొందిన అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా, మేకల షెడ్డు నిర్మాణానికి సంబంధించిన నమూనాను పరిశీలించి, వీలైనంత తక్కువ ఖర్చుతో మెరుగైన నాణ్యమైన మేకల షెడ్లను నిర్మించేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. స్థానిక జాతి మేకల అభివృద్ధి కోసం మంచి జాతి మేకల పోతులను ఎంపిక చేసి, ఏదైనా ఒక గ్రామంలో ఐదు పోతులను పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు.