22-09-2025 09:07:19 PM
ప్రజలు శాంతియుత వాతావరణంలో దసరా, దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి
జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర
రాజంపేట పోలీస్ స్టేషన్ ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పి
కామారెడ్డి,(విజయక్రాంతి)ఫ వీధుల్లో క్రమశిక్షణ, నిబద్ధతపై దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పోలీస్ సిబ్బందికి సూచించారు. సోమవారం కామారెడ్డి జిల్లా రాజంపేట్ పోలీస్ స్టేషన్‌ను అకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా మొదట రోల్ కాల్‌ను పరిశీలించి హాజరైన, గైర్హాజరైన సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. మానవ వనరులను పూర్తిస్థాయిలో వినియోగం, రోల్ కాల్ ప్రాముఖ్యతను వివరించి ఇది సిబ్బందిలో నిబద్ధతను, క్రమశిక్షణను పెంపొందించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పోలీస్ సిబ్బందితో మాట్లాడి అన్నిగ్రామాల సమాచారం సస్పెక్ట్స్, రౌడీ షీటర్స్ ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రతి కేసును నైపుణ్యంతో, నిజాయితీతో సమగ్రంగా విచారించి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి పోలీస్ అధికారిపై ఉందన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులపై వేగంగా స్పందించి తక్షణమే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా మెరుగైన పోలీసింగ్ సాధ్యమవుతుందన్నారు. బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ విధుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు, అనుమానాస్పద చర్యలపై వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.
విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని, విపిఒలు తమకు కేటాయించిన గ్రామాలను తరచూ సందర్శిస్తూ, సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ప్రజల రక్షణనే ధ్యేయంగా భావిస్తూ విధుల్లో నిబద్ధత చూపాలని అన్నారు. డయల్ 100 ద్వారా అందే ఫిర్యాదులపై వేగంగా, సమర్థవంతంగా స్పందిస్తూ, ప్రజలకు విశ్వాసం కలిగించేలా వ్యవహరించాలని సూచించారు. అధికారులకు స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని ఎస్పీ అందించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే విధంగా బందోబస్తు ఏర్పాటు చేయాలని రాజంపేట్ పోలీసులకు సూచించారు.