calender_icon.png 2 August, 2025 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫార్మారంగంలో మెదక్‌కు ప్రోత్సాహం

02-08-2025 12:06:01 AM

  1. అదితి పథకం కింద జిల్లా ఎంపిక

ఇప్పటికే వెయ్యి కోట్లు కేటాయింపు

కేంద్ర విద్యుత్ శాఖ అదనపు కార్యదర్శి ఆకాశ్ త్రిపాఠి

హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): దేశంలో ఫార్మా పరిశ్రమల రంగంలో ప్రపంచ ఇంధన సామర్థ్య సాంకేతికతలను ప్రోత్సహించడానికి తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలను అదితి పథకం కింద కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ) ఎంపిక చేసింది. వీటిలో బడ్డి, మడ్గావ్, అహ్మదాబాద్, బీదర్‌తోపాటు తెలంగాణలోని మెదక్ కూడా ఉంది. మెదక్‌లో ఫార్మా రంగంలో అత్యాధునిక ఇంధన సాంకేతికతలను అందించడం,

ఎంఎస్‌ఎంఈ రంగానికి తాము తీసుకున్న రుణాలపై వడ్డీ రాయితీ అందించడం ద్వారా ఆర్థికంగా మరింత ఊతమిచ్చేందుకు మెదక్‌ను ఎంపిక చేసింది. ఇంధన సమర్థ చర్యల అమలులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి అనేక రాష్ట్రాల చురుకైన పాత్రను విద్యుత్ మంత్రిత్వశాఖ ప్రత్యేకంగా గుర్తించింది. అదే సమయంలో ఫార్మా రంగంలో అదితి పథకాన్ని అమలు చేయడానికి మెదక్‌ను ఎంపిక చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేసేందుకు ముందుకు వచ్చి భారతదేశ స్వచ్ఛమైన పారిశ్రామిక వృద్ధిలో అదితి పథకాన్ని ఒక మలుపుగా మార్చాలని పిలుపునిచ్చింది.

దేశంలో ఎంఎస్‌ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడానికి, స్థిరమైన పారిశ్రామిక పద్ధతులను ప్రోత్సహించడానికి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అసిస్టెన్స్ ఇన్ డిప్లాయింగ్ ఎనర్జీ ఎఫీషియంట్ టెక్నాలజీ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (అదితి) పథకం రూపకల్పన చేసి దాని అమలుకోసం రూ.వెయ్యి కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో భాగంగా పరిశ్రమల స్థాపనలో ఇంధన సామర్థ్య టెక్నాలజీలను అమలు చేయడంలో సాయం చేసేందుకు అదితి పథకాన్ని ప్రారంభించింది. ఇది లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈ రంగానికి ఆర్థిక వెన్నెముకగా నిలవనుంది. 

ఎంఎస్‌ఎంఈ రంగానికి వరం..

ఎంఎస్‌ఎంఈ రంగానికి అదితి పథకం ఒక వరమని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, బీఈఈ డైరెక్టర్ జనరల్ ఆకాశ్ త్రిపాఠి పేర్కొన్నారు. పరిశ్రమల ప్రయోజనాలను పెంచుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్ని రాష్ట్రాలను కోరారు. రూ.వెయ్యి కోట్ల బడ్జెట్‌లో రూ.875 కోట్లు వడ్డీ రాయితీగా కేటాయించినట్టు తెలిపారు. ఇంధన- సమర్థవంతమైన సాంకేతికతల అప్‌గ్రేడ్‌ల కోసం రాయితీ ఫైనాన్స్‌ను సులభతరం చేయడానికి రూ.50 కోట్లు కేటాయించామన్నారు.

దీంతో ఎంఎస్‌ఎంఈల ద్వారా గణనీయమైన రుణాలతో సహా రూ.9 వేల కోట్లకు పైగా మొత్తం పెట్టుబడులను ప్రభావితం చేస్తుందని భావించారు. రాష్ర్టస్థాయిలో ఈ పథకం అమలు ప్రాముఖ్యతను బీఈఈ కార్యదర్శి మిలింద్ డియోర్ నొక్కి చెప్పారు. ఈ పథకాన్ని చేరుకోవడం, హ్యాండ్ హోల్డింగ్ చేయడం, స్కేలింగ్ చేయడంలో ఎస్‌డీఏల పాత్ర చాలా కీలకమన్నారు. అదితి పథకం 60 పారిశ్రామిక క్లస్టర్లు, వస్త్రాలు, ఫౌండ్రీలు వంటివాటితోపాటు ఆహార ప్రాసెసింగ్‌తో సహా 14 శక్తి- ఇంటెన్సివ్ రంగాల్లో పనిచేస్తుందన్నారు.

కొవిడ్ మహమ్మారి దేశ, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసిన తర్వాత ఆర్థిక రంగం కోలుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు ప్రారంభించిందన్నారు. అందులో అదితి పథకం కూడా భాగమని, కానీ ఇది కేవలం ఆర్థికంగానే కాకుండా దీర్ఘకాలిక స్థిరత్వం, ఉద్యోగ సృష్టి, దేశ వాతావరణ పరిస్థితుల సమతుల్యత సాధించడానికి కీలకమైన సాధనంగా పనిచేస్తోందన్నారు.