10-10-2025 12:44:23 AM
వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ‘పేపర్ బాయ్’ చిత్రంతో దర్శకుడిగా ప్రతిభ చాటిన జయశంకర్ వంగ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస్ రామిరెడ్డి, డీ శేషురెడ్డి మారంరెడ్డి, డాక్టర్ తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్‌రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఏషియన్ సురేశ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10న రాబోతోంది.
ఈ సందర్భంగా నిర్వహించిన మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పలువురు రాష్ట్ర మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు సాయికుమార్ మాట్లాడుతూ.. “పురాణా ఇతిహాసాల గురించి చిన్నప్పుడు అమ్మ చెప్పేది. జయశంకర్ అరిషడ్వర్గాల నేపథ్యంగా సినిమా అని చెప్పిప్పుడు కొత్తగా అనిపించింది. నా 50 ఏళ్ల నట జీవితంలో అరి లాంటి చిత్రంలో నటించినందుకు గర్వపడుతున్నా.
ఇలాంటి గొప్ప సినిమాను అందరూ థియేటర్లలో చూసి ఆదరించాలి” అన్నారు. చిత్ర దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ.. “అరి’ సినిమా మనల్ని మనం చూసుకునే అద్దం లాంటిది. ఈ అరిషడ్వర్గాల కాన్సెప్ట్‌ను ఎంతోమంది సద్గురులను కలిసి ఒక ఎంటర్‌టైనింగ్‌గా ఈ చిత్రంలో రూపొందించాను. ఈ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు” అన్నారు.
మంత్రి జీ వివేక్ మాట్లాడుతూ.. “సినిమా బిజినెస్ అంటేనే రిస్క్. తగినన్ని ప్రోత్సాహకాలిస్తూ మన చిత్ర పరిశ్రమను మనం కాపాడుకోవాలి. అప్పుడే స్థానికంగా ఉన్న ప్రతిభావంతులకు అవకాశాలు వస్తాయి” అన్నారు. ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. “మనమంతా మనుషులం కాబట్టి అరిషడ్వర్గాలుంటాయి. వాటిని పూర్తిగా వదిలే యడం సాధ్యం కాదు. వీలైనంత తగ్గించుకుంటే మంచిది.
ఆ ప్రయత్నానికి ఈ సినిమా తోడ్పడాలని కోరుకుంటున్నా” అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి, తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ జీ చిన్నారెడ్డి, త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.