04-08-2025 08:11:34 PM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..
మంచిర్యాల (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించే విధంగా సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) కోరారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్ రావు, హరికృష్ణలతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు ప్రజలు మున్సిపాలిటీ లోని 2వ వార్డులో గల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా కాకుండా కాపాడాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెల్లంపల్లి సమీకృత కూరగాయల మార్కెట్లో లక్కీ డ్రా పద్ధతి ద్వారా ఎంపికైన దుకాణ లబ్ధిదారులు తమ దరఖాస్తులో లక్కీ డ్రా ద్వారా ఎంపికైన లబ్దిదారులకు అలాట్మెంట్ లెటర్ ఇచ్చి షాపు లీజు అగ్రిమెంట్ చేయాలని కోరారు.
విద్యార్థి జన సమితి ప్రతినిధి బచ్చలి ప్రవీణ్కుమార్ తన దరఖాస్తులో మందమర్రి మండలం పొన్నారం గ్రామంలోని వసతి గృహాన్ని అందుబాటులోకి తెచ్చి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. హాజీపూర్ మండలం గుడిపేట, ఆర్ అండ్ ఆర్ కాలనీవాసులు ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపుకు గురైన వారికి పునరావాసంలో భాగంగా గ్రామ అభివృద్ధి కొరకు కేటాయించిన భూమిని కొందరు అక్రమంగా ఆక్రమిస్తున్నారని, ప్రజా ప్రయోజనార్థం కేటాయించబడిన భూమిని కాపాడాలని కోరారు. జైపూర్ మండల కేంద్రానికి చెందిన సహెరాబాను తనకు ఇంటి స్థలం ఉందని ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తింపచేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
హాజీపూర్ మండలం సబ్బెపెల్లి గ్రామానికి చెందిన గెడ మారు, తన కుటుంబ సభ్యులు గ్రామ శివారులో గల తమ భూమిలో తాతల నుండి సాగు చేసుకుంటున్నామని, ఇప్పుడు కొందరు తమను భూమిలోకి రానివ్వకుండా అడ్డుకుని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఈ విషయమై విచారించి తమకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. చెన్నూరు పట్టణంలోని కుమ్మరిబొగుడ ప్రాంతానికి చెందిన సర్వర్ ఉన్నిసాబేగం తనకు రావలసిన వితంతు పింఛన్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. భీమిని మండలం సికినం గ్రామానికి చెందిన గాదె పోశక్క తనకు గల భూమి పట్టా పాస్ పుస్తకంలో తక్కువ విస్తీర్ణం నమోదు అయిందని, మిగిలిన భూమి వేరే వారి పేరిట నమోదు అయిందని, ఈ పొరపాటున సవరించి తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
జైపూర్ మండలం షెట్పెల్లి గ్రామానికి చెందిన చింతల అర్జయ్య గ్రామ శివారులో తనకు గల భూమిలో కొందరు దౌర్జన్యంగా చొరబడి భూమిని దున్నారని, ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జైపూర్ మండల కేంద్రానికి చెందిన కొరివి కత్తెరసాల తాను మరో ఇద్దరితో కలిసి భూమి కొనుగోలు చేశానని, వారిలో ఒకరు చనిపోవడంతో మొత్తం భూమిని తమకు తెలియకుండా విక్రయించారని, ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.