calender_icon.png 20 October, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోను, సతీశ్ ముఠాకు దండన తప్పదు

20-10-2025 02:00:46 AM

  1. కోవర్టులుగా మారి వెన్నుపోటు పొడిచారు
  2. వాళ్లను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం
  3. మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్

హుస్నాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాం తి): మావోయిస్టు పార్టీలో జరిగిన అతిపెద్ద చీలికపై పార్టీ కేంద్ర కమిటీ తీవ్రంగా స్పందించింది. కేంద్ర కమిటీ సభ్యుడు సోను, దండ కారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్ జడ్ సీ) ఉత్తర సబ్ జోనల్ బ్యూరో ఇన్‌చార్జి సతీశ్‌తో సహా 61 మంది నాయకులు, కార్యకర్తల లొంగుబాటును పార్టీ ’విప్లవ ద్రోహం’, ’పార్టీ విచ్చిన్నకరం’, ’విప్లవ ప్రతిఘాతకత’గా అభివర్ణించింది.

విప్లవ ద్రోహులుగా, పార్టీ విచ్ఛిన్నకు లుగా, విప్లవ ప్రతిఘాతకులుగా మారిన సోను, సతీశ్ ముఠాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. వారికి తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ అధికా ర ప్రతినిధి అభయ్ పేరిట ఈ నెల 16న లేఖ ను విడుదల చేశారు. సోను, సతీశ్ ముఠాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు, వారికి తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునివ్వడం మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఒక కీలక పరిణామంగా నిలిచింది.

మే నెలలో జరిగిన కగార్ దాడిలో పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు అమరత్వం తర్వాత సోనులో పేరుకుపోయిన సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణ బల హీనతలు శత్రువు ముందు లొంగిపోయేందు కు దారితీశాయని సీసీ విమర్శించింది. సోనులో పెరిగిన సుఖలాలస, స్వార్థం, ప్రాణభీతి లొంగుబాటుకు కారణమయ్యాయని, దీన్ని దాచిపెట్టుకునేందుకు పార్టీ అనుసరిస్తు న్న రాజకీయ-సైనిక పంథా తప్పు అనే మితవా ద అవకాశవాద, రివిజనిస్టు వైఖరితో కూడిన ప్రకటనను విడుదల చేశారని మండిపడింది.

సోను కేంద్ర, రాష్ట్ర ఇంటలిజెన్స్ ఏజెన్సీలతో సంబంధాలు కొనసాగిస్తూ, తన భార్య లొం గుబాటుకు పథకం రూపొందించినప్పటి నుంచే కోవర్టుగా మారాడని ప్రకటనలో ఆరోపించారు. ఈ తప్పుడు వాదనలపై విశ్వాసం ఉంటే పార్టీ కేంద్ర కమిటీలో చర్చించకుండా, నిబంధనలను ఉల్లం ఘించి, గత కొన్ని నెలలుగా కేడర్లతో చర్చలు జరిపి పార్టీని చీల్చే కుట్రకు పూనుకున్నాడని ఆరోపించింది. 

విప్లవ ద్రోహులు 

సోను, సతీశ్ గత సంవత్సరం నుంచే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలు కొనసాగిస్తూ, పార్టీలో ఉంటూనే విప్లవ ద్రోహులు (రెనగేడ్స్)గా, కోవర్టులుగా వ్యవహరించారని కేంద్ర కమిటీ తెలిపింది. ఈ కోవర్టులకు నూతన పంథాలో విప్లవోద్యమాన్ని నిర్మించడానికి నైతిక అర్హత లేదని చెప్పింది.

సోను, వివేక్, దీప సహా 61 మంది ఈ నెల 14న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయి, పార్టీకి చెందిన 50 తుపాకులను పోలీసులకు అప్పగించడం, సతీశ్‌తో సహా మరో నలుగురు ఎస్.జెడ్.సీ. సభ్యులు దాదాపు 150 మందితో కలిసి ఆయుధాలను అప్పగించడం విప్లవకారులను హత్య చేయాలని శత్రువుకు సాయం చేయడమేనని పార్టీ పేర్కొంది.

సోను, సతీశ్ ముఠాల లొంగుబాటు తాత్కాలిక నష్టాలే తప్ప, విప్లవోద్యమం శాశ్వత ఓటమికి గురికాదని పార్టీ తేల్చి చెప్పింది. ప్రజాపోరాటాల పేరుతో వస్తే వారిని తన్ని తరమాల్సిందిగా ప్రజలకు పిలుపువిప్లవోద్యమనిచ్చింది. సోను వాదనల్లోని మోసాన్ని అర్థం చేసుకోకుండా ఆయనతో కలిసి లొంగిపోయిన పార్టీ సభ్యులు, పీఎల్జీఏ సభ్యులు ప్రజాపక్షానికి తిరిగి రావాల్సిందిగా కోరింది.

అలాంటి వారికి పార్టీ నుంచి ఎలాంటి ప్రమాదం ఉండబోదని హామీ ఇచ్చింది. ఈ లొంగుబాట్లు విప్లవోద్యమానికి తీవ్ర నష్టమే అయినప్పటికీ, ఇవి కేవలం తాత్కాలిక నష్టాలేనని, ఈ సంక్షోభాన్ని అధిగమిస్తామని పార్టీ కేంద్ర కమిటీ భరోసా ఇచ్చింది. కొందరు నాయకుల లొంగుబాట్లతో విప్లవోద్యమం శాశ్వత ఓటమికి గురికాదు అని, వర్గాలున్నంత కాలం వర్గపోరాటాలు, ప్రజాయుద్ధాలు కొనసాగడం తిరుగులేని చారిత్రక నియమం అని నొక్కి చెప్పింది.