19-04-2025 10:27:36 PM
భూ భారతి చట్టం అవగాహన సదస్సులో పాల్గొన్న కలెక్టర్ ఆశిష్ సంగ్వన్...
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భూ సమస్యల పూర్తి పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన భూభారతి చట్టానికి రూపకల్పన చేసిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మీసన్ పల్లి గ్రామంలో నీ రైతు వేదికలో శనివారం నిర్వహించిన భూ భారతి చట్టంపై అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ధరణి స్థానంలో వచ్చిన నూతన భూభారతి చట్టం ప్రకారం ఏ సమస్యను అధికారులు ఎన్ని రోజుల్లో పరిష్కరించాలి, అది పరిష్కారం కాకుంటే ఎవరికి అప్పిలు చేయాలనే దానిపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసిందని పేర్కొన్నారు.
జిల్లా స్థాయిలో స్థానికంగా భూ సమస్యలు పరిష్కరించేందుకు ఆర్డిఓ కలెక్టర్లకు అధికారాలు కల్పించారని అన్నారు. భూ సమస్యలు పరిష్కరిస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై అభ్యంతరాలు ఉంటే భూభారతి చట్టం ప్రకారం అప్పులు చేసుకునే అవకాశం కూడా ఇందులో ఉందన్నారు. రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డిఓ)నిర్ణయం సరైనది కాదని భావిస్తే కలెక్టర్ కి అప్పీలు చేసుకోవచ్చని, ఒకవేళ కలెక్టర్ నిర్ణయం పై అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్ వద్ద అప్పిలు చేసుకోడానికి అవకాశం ఉందన్నారు. గతంలో ధరణి పోర్టల్ లో ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని, భూ భారతిలో అలాంటి సమస్యకు చెక్కు పెట్టడం జరిగిందన్నారు.
భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం ద్వారా నిజమైన భూమి యజమానులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. భూమి కొనుగోలు, గిఫ్ట్ (దానం), తనఖా(రైన్), పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే సంబంధిత తహసిల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులలో మార్పు చేసి పట్టాదారు పాసు పుస్తకాన్ని జారీ చేస్తారని ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యే విధంగా చట్టంలో పొందుపరిచారని తెలిపారు. భూభారతి చాలా సులభమైన పద్ధతిలో రైతులకు ఎంతో మేలు చేస్తుందని, భూభారతి చట్టం పై రైతులు ప్రజలు అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్ డి ఓ మన్నే ప్రభాకర్, తహసిల్దార్ ప్రేమ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రజిత, ఏఎంసి కార్యదర్శి శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, సొసైటీ డైరెక్టర్ గోపికృష్ణ, కుడుముల సత్యనారాయణ,ఆయా గ్రామాల రైతుల తదితరులు పాల్గొన్నారు.