calender_icon.png 21 May, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌కు పిలుపు

21-05-2025 12:34:14 AM

కాళేశ్వరం కాలింగ్!

  1. మాజీమంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌కూ నోటీసులు పంపించిన పీసీ ఘోష్ కమిషన్
  2. వ్యక్తిగత విచారణకు ఆదేశం
  3. కమిషన్ గడువు పెంచిన మరుసటిరోజే నోటీసులు
  4. గత ప్రభుత్వ పెద్దల విచారణపై సర్వత్రా ఆసక్తి

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): కాళేశ్వరం కమిషన్ గడువు పెంచి న మరుసటి రోజే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌కు కమిషన్ నోటీసులు పంపించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో దానితో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల్లో  చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను గత ఏడాది మార్చిలో ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.

అప్పటినుంచి ఇంజినీర్లు, అధికారులు, కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థ ప్రతి నిధులు, కన్సల్టెంట్లు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల అధికారులు, నిపుణులు, పలువురు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థ లకు చెందినవారిని కమిషన్ విచారణ చేసింది. ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగుస్తుందనగా ఈనెల 19న ప్రభుత్వం మరో రెండు నెలల పాటు కమిషన్ గడువు పెంచింది.

గడువు పెంచిన మరుసటి రోజే కేసీఆర్, హరీశ్‌రావు, ఈటలకు నోటీసులు పంపించారు. ఈ నెల 5న కేసీఆర్, 6న హరీశ్‌రావు, 9న ఈటల రాజేం దర్‌ను విచారణకు స్వయంగా హాజరు కావాలని కమిషన్ తన నోటీసుల్లో స్పష్టం చేసింది. తాము పంపించిన నోటీసులకు 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలని కమిషన్ స్పష్టం చేసింది.

ఇన్నాళ్లుగా ఎప్పుడెప్పుడా అని అంతా ఆసక్తిగా ఎదు రుచూసిన గడువు చివరకు వచ్చేసిందని సాగునీటి పారుదల శాఖ నిపుణులు పేర్కొం టున్నారు. కాగా కాళేశ్వరం కమిషన్‌ను గత ఏడాది మార్చిలో ఏర్పాటు చేయగా.. ప్రభుత్వం ఏడుసార్లు పొడిగిస్తూ వచ్చింది. 

ప్రపంచ వింతగా ప్రచారం..

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద వండర్ అని గత ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకుంది. అపర భగీరథుడిగా కేసీఆర్‌ను కీర్తించారు. వందల కోట్ల రూపాయలతో ప్రచారం కూడా చేసుకున్నారు. డిస్కవరీ చానల్‌లో తెలుగు, ఇంగ్లిష్ సహా 6 భాషల్లో ప్రచారం చేశారు. ప్రపంచమంతా ఈ ప్రాజెక్టుపై చర్చించేలా పరిస్థితి మారింది.

దీంతో ఈ ఘనతంతా అప్పటి సీఎం కేసీఆర్‌దేనని గత ప్రభుత్వం, అధికార బీఆర్‌ఎస్ పార్టీ గొప్పగా చెప్పుకుంది. తానే పెద్ద ఇంజినీరుగా చెప్పుకున్న కేసీఆర్‌కు అదే ఇప్పుడు తలనొప్పి తెచ్చిపెట్టిందని విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్ చెప్పినట్లే విన్నామని, ఆయన ఆదేశాల మేరకే డిజైన్లు మార్చామని, ఆయన ఏది చెబితే అది చేశామని కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా పలువురు ఇంజినీర్లు చెప్పడం గమనార్హం.

ఈ నేపథ్యంలో కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్‌ను కమిషన్ ఏఏ ప్రశ్నలు అడుగుతుందనే అంశంపై అప్పుడే చర్చలు ప్రారంభమయ్యాయి. ఇంత గొప్ప ప్రాజెక్టుగా పేరొందిన కాళేశ్వరం బ్యారేజీలు కుంగిపోవడంతో ఎంతో గొప్పగా ప్రజెంటేషన్ ఇచ్చిన డిస్కవరీ చానెల్ కూడా తమ వీడియోలోని అన్ని సామాజిక మాధ్యమాల ప్లాట్‌ఫాంల నుంచి తొలగించేయడం గమనార్హం.

హరీశ్‌రావు సైతం అమెరికాకు..

వచ్చే నెలలో హరీశ్‌రావు సైతం అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన కూడా గడువు కోరతారా అనేది తెలియాల్సి ఉంది. 

ఈటల హాజరవుతారు..

ఈటల రాజేందర్ మాత్రం విచారణకు తప్పకుండా హాజరవుతారని బీజేపీ వర్గాలు చెబుతు న్నాయి. ప్రాజెక్టు వ్యవహారంలో ఆయనకు ఏ మాత్రం సంబంధం లేదని, విచారణకు హాజరుకావడానికి ఆయనకు ఏ ఇబ్బంది ఉండబోదని బీజేపీ నేతలు అంటున్నారు.

కేసీఆర్ విచారణకు హాజరవుతారా? 

వచ్చే నెలలో అమెరికాలో కేసీఆర్ మనువడు (కేటీఆర్ కుమారుడు) హి మాన్షు గ్రాడ్యుయేషన్ డే కోసం ఆయ న అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం. జూన్ మొదటి వారంలో అమెరికా వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను జూన్ 5న విచార ణకు హాజరుకావాలని కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు పంపించింది. అయితే కేసీఆర్ విచారణకు హాజరవుతారా.. లేక తనకు ముందే ఫిక్స్ అయిన కార్యక్రమం ఉన్నందుకు విదేశాలకు వెళ్తున్న ట్లుగా కమిషన్‌కు లేఖ రాసి గడువు కోరతారా అనేది వేచిచూడాల్సిందే.

బాధ్యులకు తాఖీదులు

పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ జమానాలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యింది. కేసీఆర్ నిర్మాణ వ్యవహారాల్లోనూ చురుగ్గా వ్యవహరించారు. మొదటి టర్మ్ లో హరీశ్‌రావు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, రెండో టర్మ్‌లో ఆర్థిక మంత్రిగా ఈ ప్రాజెక్టు వ్యవహారంలో కీలకంగానే ఉన్నారు. ఇక ఈటల రాజేందర్ మొదటి టర్మ్‌లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు.

అయితే ఆయన ప్రమేయం ఈ ప్రాజెక్టు పరిధిలో పెద్దగా ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇక కాళేశ్వరం అంటే కేసీఆర్..కేసీఆర్ అంటే కాళేశ్వరం అన్నంతగా గత పదేళ్ల పాలన సాగింది. తమ హయాంలో కేసీ ఆర్ ఈ ప్రాజెక్టు కోసం అనేకమార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించారు.

గంటల కొద్దీ ప్రగతిభవన్‌లో గూగుల్ మ్యాప్స్ ద్వారా స్క్రీన్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏ కాలువ ఎటు పోవాలో, బ్యారేజీ నిర్మాణాలు ఎలా సాగాలో, ఆయకట్టు ఎక్కడెక్కడ రావాలో ఇలా అనేక అంశాలు కేసీఆర్ ఇంజినీర్లకు దిశానిర్దేశం చేశారు.

కేసీఆర్‌తో హరీశ్ భేటీ

ఘోష్ కమిషన్ నోటీసులు జారీచేసిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సమావేశమయ్యారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ సమావేశంలో సుమారు గంటసేపు వారిమధ్య చర్చలు సాగినట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బారేజ్ కుంగుబాటు అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధ్దం, ఆరోపణలు ప్రత్యారోపణలు నడుస్తున్నాయి.