calender_icon.png 2 September, 2025 | 9:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్ష బీభత్సం

02-09-2025 12:00:00 AM

  1. తడిసి ముద్దయిన భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలు
  2. జలదిగ్బంధంలో ఏజెన్సీ గ్రామాలు.. స్తంభించిన రాకపోకలు

భద్రాద్రి కొత్తగూడెం/మహబూబాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో ఆదివా రం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షం కురింది. దీంతో రోడ్లు వాగులయ్యాయి. మహబూబాబాద్ జిల్లా లో ఏజెన్సీ ప్రాంతంలో 6.8 సెం.మీ.ల వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా వాగులు, ఏర్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొత్తగూడ, గంగారం, గూడూరు, బయ్యారం ఏజెన్సీ ప్రాంతాల్లో మసివాగు, మున్నేరు వాగు, పాకాలవాగు, గుంజే డు వాగు, రాళ్ళ తెట్టేవాగు రోడ్లపై ప్రవహించడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి.

ఏజెన్సీ ప్రాంతం లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గూడూరు మండల కేంద్రానికి సమీపంలో ఉన్న పాకాల వాగు హై లెవెల్ వంతెన పైనుండి ప్రవహించడంతో కేసముద్రం, నెక్కొండ మండలాలకు గూడూరు నుండి రాకపోకలు స్తంభించిపోయాయి. గార్ల వద్ద ఏరు పొంగి ప్రవహించ డంతో రాంపురం, మద్దిమంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

అశ్వరావుపేటలో 12 సెం.మీ.ల వర్షం 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తం గా రోడ్లు వాగులయ్యాయి. కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని పాల్వంచ, కొత్తగూడెం జంట పట్టణాల్లో రోడ్లన్నీ జలమాయమయ్యా యి. పాల్వంచ పట్టణ పరిధిలోని దమ్మపేట సెంటర్ నుంచి శ్రీనివాస కాలనీ ప్రధాన రహదారిపై అర కిలోమీటర్ వరకు 5 అడుగుల వరద చేరుకొని రాకపోకలకు ఇబ్బందులు కలిగించాయి.

చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ పంచాయతీలో భారీ వర్షం కారణంగా జాతీయ రహదారిపై వరద నీరు చేరి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం నాగుపల్లిలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపా తం నమోదయింది. దీంతో రహదారులపై అడుగు లోతు నీరు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

పంట పొలాలు నీట మునిగాయి. అశ్వరావుపేట, దమ్మపేట, మొలకలపల్లి, చండ్రుగొండ, అన్నపరెడ్డిపల్లి మండలాల్లో వర్షం దంచి కొట్టింది. అశ్వరావుపేట నుండి వాగోడ్డుగూడెం వెళ్లే మార్గంలో చట్టపై వరద నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ములకలపల్లి మండలంలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫలితంగా మండలంలో మొర్రేడు పాములేరు సఖి వాగులు ఉదృతంగా పొంగే ప్రవహించాయి. సీతారాంపురం పంచాయతీలో పాతూరు నుంచి ఎర్రోడు గ్రామానికి వెళ్లే అంతర్గత పంచాయతీ రోడ్డు కోతకు గురైంది.

వరదల్లో చిక్కుకున్న 200 బర్రెలు

నిర్మల్(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలం తిరుపల్లి మునిపల్లి గ్రామ శివారులో గోదావరి నది కొర్రుపై మేత మేయడానికి వెళ్లిన 200 గేదెలు సురక్షితంగా ఉండటంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఐదు రోజుల క్రితం ఈ రెండు గ్రామాలకు చెందిన 200 గేదెలను మేపేందుకు పశువుల కాపరి గోదావరి నది మధ్యన ఉన్న కుర్రు(ఎత్తున మైదాన ప్రదేశం)కు తీసుకెళ్లారు.

అక్కడ గేదెలను మేతమేపుతుండగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద రావడంతో 39 గేట్లు ఎత్తి నీటిని వదిలారు. దీంతో ఈ ఎత్తున ప్రదేశం చుట్టూ గోదావరి వరద ముంచెత్తడంతో పశువుల కాపరి కూడా అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది. కలెక్టర్, ఎస్పీ రెస్క్యూ బృందంతో పశువుల కాపరిని అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు. గేదెలు అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది.

మూడు రోజులుగా ఉధృతంగా వరద ప్రవాహం ఉండటంతో తమ గేదెలు కొట్టుకుపోయాయేమోనని గ్రామస్థులు ఆందోళన చెందారు. అయితే గోదావరిలో వరద తగ్గడంతో సోమవారం కొందరు గజ ఈతగాళ్లు సాయంత్రం కుర్రుపై వెళ్లగా గేదెలు కనిపించాయి. నీటి ప్రవాహం తక్కువగా ఉన్న ప్రదేశం ద్వారా గేదెలను ఊరికి తీసుకువచ్చారు.