02-09-2025 12:40:10 AM
ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లెందులో బీఆర్ఎస్ వర్గ పోరు రోడ్డుకెక్కింది. ఇంతకాలం అంతర్గతంగా ఉన్న వర్గ పోరు ఆదివారం టేకులపల్లి లో జరిగిన సమావేశంలో బహిర్గతమైంది. ఇక శాసనసభలో కాలేశ్వరం నివేదికపై జస్టిస్ గోష్ ఇచ్చిన నివేదిక విషయంలో ప్రభుత్వానికి బిఆర్ఎస్ మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరిన విషయం విధితమే. కాలేశ్వరం నివేదికపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం నిరసన ఆందోళనలు చేపట్టారు.
అయితే ఇల్లందులో ఈ నిరసన ఆందోళనలకు సంబంధించి పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ వ్యవస్థాపక అధ్యక్షుడు దిండిగాల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ రెండు వర్గాలుగా చీలిపోయి వేరువేరుగా నిరసనలు చేపట్టారు. దింతో బీఆర్ఎస్ వర్గ పోరు పట్ల పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే భర్త పార్టీ నాయకులను బెదిరింపులకు గురిచేస్తున్నాడంటూ పట్టణానికి చెందిన పలువురు నాయకులు జిల్లా అధ్యక్షుడికి నేరుగా చెప్పడం, జిల్లా అధ్యక్షుడు ఇరువర్గాల నాయకులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన వినకపోవడంతో విస్తు పోవడం నెలకొందని అంటున్నారు.
గత కొంతకాలంగా పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ తమ వర్గ నాయకులతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు అంటూ మరో వర్గానికి చెందిన నాయకులు పేర్కొంటుండడం గమనార్హం. అంతేకాదు పార్టీలో ఇటీవల కాలంలో నియోజకవర్గానికి సంబంధంలేని నాయకుడు సంజీవ్ నాయక్ వెంట దిండిగాల వర్గం తిరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో పార్టీని ఎలాగైనా గెలిపించాలని అధిష్టానం గట్టిగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఇల్లెందులో బీఆర్ఎస్ నాయకుల మధ్య వర్గపోరు బయట పడడంతో కాంగ్రెస్ కు మంచి అవకాశం దక్కుతుందని పలువురు పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు.