02-09-2025 12:38:47 AM
2.36 లక్షల ఎకరాల్లో పంటనష్టం
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): ఇటీవల భారీ వర్షాలు, వరద లతో దెబ్బతిన్న రోడ్లు, భవనాలు, చెరువులు, కుంటలకు మరమ్మతులు చేపట్ట డంతో పాటు విద్యుత్ సబ్ స్టేషన్ల పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయా లని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ర్ట విపత్తు ఉపశమన నిధు లున్నా నిబంధనల ప్రకారం వాటిని వ్యయం చేయడంలో అలసత్వం చూపడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరదల్లో చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, చనిపోయిన పశువులకు కూడా పరిహారం అందించాలని ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలతో వాటిల్లిన నష్టాలపై సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో సోమవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 82 మండలాల్లో 2.36 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 1,052 చోట్ల 1023 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు. రోడ్ల డ్యామేజ్‌పై సమగ్ర నివేదిక తయారు చేయాలన్నారు. రెండురో జుల్లో పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను సమర్పిస్తే కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని సీఎం తెలిపారు. గతేడాది ఉమ్మడి ఖమ్మం, వ రంగల్ జిల్లాల్లో వర్షాలతో తీవ్రనష్టం వాటిల్లినా కేంద్రం నుంచి సరైన సహాయం అందకపోవడంపై సీఎం ఆరా తీశారు.
గతంలో కేంద్రం ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం, గతేడాదికి సంబంధించి రావల్సిన ని ధులు.. ప్రస్తుతం వ్యవసాయ, పశు సంవర్ధక, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, వైద్యారోగ్య, విద్యుత్ శాఖల పరిధిలో వాటిల్లిన నష్టంపై సమగ్ర నివేదికలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఈ రెండు నివేదికలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి వి క్రమార్క నేతృత్వంలోని బృందం ఈ నెల నాలుగో తేదీన ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిసి అందజేస్తోందని సీఎం తెలిపారు. మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి, కిందిస్థాయి అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
ప్రారంభ తేదీలను నిర్ణయించాలి..
రాష్ర్టంలో నిర్మాణంలో ఉన్న నూతన వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు, ఆసుపత్రుల భవనాల పనులు వేగవంతం చేయ డంతో పాటు వాటి ప్రారంభానికి తేదీలు నిర్ణయించాలని ఆ శాఖ కార్యదర్శి క్రిస్టియానా జడ్ చోంగ్తూను సీఎం ఆదేశించారు. కామారెడ్డి, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు.
ఎస్డీఆర్‌ఎఫ్ నిధులను వినియోగించాలి..
అన్ని శాఖలు ఎస్డీఆర్‌ఎఫ్ నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. విపత్తు సమయాల్లో స్పందించేందుకు రాష్ర్ట ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసిన ఎస్డీఆర్‌ఎఫ్ దళాలు వరదల సమయంలో మెరుగైన సేవలు అందించడంపై ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.
భారీవర్షాల సమయంలో 42 ఆపరేషన్లలో పాల్గొని 217 మందిని ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రక్షించడంపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాల్లో పనులకు కంటింజెంట్ కింద కలెక్టర్లకు రూ.10 కోట్లు, సాధారణ నష్టం వాటిల్లిన జిల్లా కలెక్టర్లకు రూ.5 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తామని సీఎం తెలిపారు.
సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు, సీఎస్ రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు వీ శేషాద్రి, కేఎస్ శ్రీనివాసరాజు, సీఎం ప్రత్యేక కార్యదర్శి బీ అజిత్ రెడ్డి, సీఎం కార్యదర్శి కే మాణిక్‌రాజ్, సీఎం ఓఎస్‌డీ వేముల శ్రీనివాసులు, డీజీపీ డాక్టర్ జితేందర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా పాల్గొన్నారు.
సబ్‌స్టేషన్లను అధునాతన సామగ్రితో ఏర్పాటు చేయాలి..
నీట మునిగిన సబ్ స్టేషన్ల స్థానంలో అధునాతన సామగ్రి, సా మర్థ్యంతో కూడిన సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్‌కు సీఎం ఆదేశించారు. పురపాలక, పంచాయతీరాజ్, జీహెచ్‌ఎంసీ పరిధిలో వీధి దీపాల నిర్వహణ, ఏర్పాటుపై సమీక్ష నిర్వహించి పరిష్కారంతో రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు సీఎం సూచించారు.
చెంగి చర్లతో పాటు జియాగుడ, అంబర్‌పేటలోని స్లాటర్ హౌస్‌లలో హలా ల్, జట్కా సక్రమంగా జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, తాగు నీటి సరఫరా, పశు సంవర్ధక శాఖ లు సమగ్ర నివేదికలు రూపొందించి రెండు రోజుల్లో అందజే యాలని సీఎం ఆదేశించారు.
257 చెరువులు, కుంటలకు గండ్లు
రాష్ర్టవ్యాప్తంగా 257 చెరువులు, కుంటలకు గండి పడ్డట్టు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. సీఎం స్పందిస్తూ చిన్న నీటిపారుదల విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆర్‌ఆర్‌ఆర్, ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన, ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాలను వినియోగించుకొని చిన్న నీటి వనరులకు మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించారు.
గతంలో నీటి వినియోగదారుల సంఘాల ఆధ్వర్యంలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, డిస్ట్రిబ్యూటరీల వారీగా సంఘాలు ఉండేవని సీఎం గుర్తు చేశారు. నీటి వినియోగదారుల సంఘాలకు సంబంధించిన నిబంధనలను పరిశీలించి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు నూతన ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు.