02-09-2025 12:42:52 AM
హరీశ్, సంతోష్, మెగా కృష్ణారెడ్డిపై కవిత మండిపాటు
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్‌లో అవినీతి అనకొండలు ఉన్నాయని, వారు దగ్గరఉండి పార్టీ అధినేత కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ పక్కన ఉన్నవాళ్ల వల్ల ఆయనకు అవినీతి మరక అంటిందని.. దీనిలో హరీష్‌రావు, సంతోష్‌రావు, మేఘా కృష్ణారెడ్డి లదే కీలక పాత్ర అని తీవ్రంగా విమర్శించారు.
హిమాలయ శిఖర సమాను డైన కేసీఆర్ ఇప్పుడు కాళేశ్వరంపై విచారణను ఎదుర్కోవడం ఏమిటని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో, ఐదేళ్లు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్‌రావు పాత్ర లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు అవినీతి మరక ఎట్లా వచ్చింది బీఆర్‌ఎస్ శ్రేణులు ఆలోచించాలన్నారు. సోమవారం హైదరాబా ద్‌లో మీడియాతో కవిత మాట్లాడారు.
బీఆర్‌ఎస్‌లోని అవినీతిపరుల వల్ల కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి విమర్శించే పరిస్థితి వచ్చిందన్నారు. తనపై హరీష్ రావు, సంతోష్ రావు ఎన్ని కుట్రలు చేసినా భరించానని.. హరీష్ రావు, సంతోష్ రా వు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. తన వెనుక బీజేపీ ఉందని, కాంగ్రెస్ ఉందని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని.. నాది కేసీఆర్, తెలంగాణ బ్లడ్ అని స్ప ష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ జపం చేస్తోందని, రేవంత్‌రెడ్డికి కేసీఆర్ పేరు చెప్పకపోతే పేపర్‌లో ఫోటో కూడా రాదని ఎద్దేవా చేశారు. వరదలు వస్తే ఆదుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. తాము ఎంపీలుగా ఉన్నప్పుడు ఆరు నెలల ముందే యూరియా కోసం కేసీఆర్ మమ్మ ల్ని అలెర్ట్ చేసేవారని గుర్తుచేశారు. కేసీఆర్‌కు తిండి ధ్యాస, డబ్బు ధ్యాస ఉండదని, అలాంటి వ్య క్తిపై అభాండాలు వేస్తున్నారని ఆవేదన వ్య క్తం చేశారు.
తనపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే తోలు తీస్తానని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ పేరుతో టైం పాస్ చేస్తోందని విమర్శించా రు. తాను డైరెక్ట్‌గా పేర్లు చెప్పిన వారిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ బీసీలను బలి చేస్తున్నారని, బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయం లో, తాము బీహార్ వెళ్లి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని తెలిపారు. సీబీఐ విచారణలో కేసీఆర్ కడిగినముత్యంలా బయటకు వస్తారన్నారు.
హరీష్‌కే పార్టీ మద్దతు..
హరీష్‌రావు లక్ష్యంగా కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో హరీష్‌రావుకు బీఆర్‌ఎస్ అండగా నిలిచింది. కవిత సంచలన కామెంట్లు చేసిన కొద్ది సేపటికే బీఆర్‌ఎస్ ట్విట్టర్‌లో హరీష్‌కు మద్దతుగా ట్వీట్ చేసింది. ‘ఇది ఆరు అడుగుల బుల్లెట్’ అంటూ హరీష్‌రావు అసెంబ్లీలో కాళేశ్వరం చర్చ పై మాట్లాడిన వీడియోను పోస్టు చేసింది. మరోవైపు, హరీశ్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మద్దతు ప్రకటించారు.
ఆదివారం అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చలో డైనమిక్‌గా మాట్లాడారని ట్వీట్ చేశారు. పార్టీ అధిష్ఠానం సైతం కవిత వ్యాఖ్యల నేపథ్యంలో అప్రమత్తం అయ్యింది. కేటీఆర్, హరీష్‌రావులతో కేసీఆర్ అత్యవసరంగా సమావేశ మైనట్టు తెలుస్తోంది. దీంతోపాటు బీఆర్‌ఎస్ అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి కవిత పీఆర్వోను తొలగించింది. పార్టీ గ్రూపులో కవితకు సంబంధించిన అన్ని వార్తలను డిలీట్ చేసింది.