02-09-2025 12:00:00 AM
భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట
భద్రాచలం, సెప్టెంబర్ 1, (విజయ క్రాంతి): ఏజెన్సీ ఏరియా పరిధిలో భూములు, పంటలు సాగు చేసుకుంటున్న గిరిజనులు , గిరిజన రైతుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించి వారికి సత్వరమే న్యాయం జరిగేలా కృషి చేస్తానని భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రినాల్ శ్రేష్ట అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు గిరిజనుల సౌకర్యార్థం సబ్ కలెక్టర్ కార్యాలయం లోనీ తన చాంబర్లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ గిరిజన గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల నుండి ఆయన దరఖాస్తులు స్వీకరించి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హత మేరకు భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను మరియు రికార్డులను పరిశీలించి తప్పనిసరిగా దరఖాస్తుదారుల సమస్యలు పరిష్కరిస్తానని ఆయన అన్నారు.
మణుగూరు మండలంకు చెందిన దుర్గ చిక్కుడు గుంట గ్రామానికి భూమికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని, పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన ఉషారాణి పట్టాదారు పాసుపుస్తకం ఇప్పించుట కొరకు, రామానుజవరం గ్రామానికి చెందిన నరసయ్య తన పొలం చుట్టూ కంచి వేశారని హద్దులు కొలిచి తన పొలం తనకు ఇప్పించుట కొరకు, కర్నే బాబురావు మణుగూరు ఓపెన్ కాస్ట్ లో తన భూమి తీసుకున్నారని తనకు తగిన న్యాయం చేయుట కొరకు, అశ్వాపురం మండలం చెందిన వీరయ్య తన భూమికి కొత్త పట్టేదార్ పాస్ పుస్తకం ఇప్పించుట కొరకు, చర్ల మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన కనుమూరి తులసిదేవి తన భూమికి కొత్త పట్టేదారు పాసుపుస్తకం ఇప్పించుట కొరకు, భద్రాచలం మండలం చెందిన గార్లపాటి శాంతారావు తన తల్లిదండ్రులు భూమిని సాగు చేయనివ్వకుండా తనపై కేసులు పెడుతున్నారని తనకు తన భూమి ఇప్పించుట కొరకు దరఖాస్తులు చేసుకున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవో రాజేంద్రనాథ్, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.