20-09-2025 12:00:00 AM
మణికొండ ;సెప్టెంబర్ 19: ఆటలు శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని పంచుతాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. అభివృద్ధిలో రాజధానితో సైతం తమ నియోజకవర్గం పోటీ పడుతోందని, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం మణికొండ మున్సిపాలిటీలో కమిషనర్ ప్రదీప్ కుమార్, స్థానిక నేతలతో కలిసి ఆయన సుడిగాలి పర్యటన చేశారు.
మొత్తం రూ.6.50 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.చిత్రపురి కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్, స్పోరట్స్ పార్కులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పోరట్స్ పార్కులో బ్యాట్ పట్టి సరదాగా కొన్ని బంతులు ఎదుర్కొని, స్థానిక యువతలో నూతనోత్సాహం నింపారు. క్రీడల ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, యువత చదువుతో పాటు ఆటలకూ సమయం కేటాయించాలని సూచించారు.
అనంతరం ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో వెనుకంజ వేసేది లేదన్నారు. చేపట్టిన పనుల వివరాలను వెల్లడిస్తూ, రూ.1.40 కోట్లతో కమ్యూనిటీ హాల్, రూ.67 లక్షలతో స్పోరట్స్ పార్కు, రూ.1.86 కోట్లతో మూడు బీటీ రోడ్లు, రూ.కోటిన్నరతో అంతర్గత రహదారులు, రూ.50 లక్షలతో సెంట్రల్ మీడియన్, మరో రూ.50 లక్షలతో వైఎస్సార్ కాలనీలో ఖాళీ స్థలాల సుందరీకరణ పనులు పూర్తి చేశామని వివరించారు.
‘ప్రజాసేవ చేసేందుకే నేను ఉన్నాను. ఏ సమస్య ఉన్నా ప్రజలు నేరుగా మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. అత్యవసరమైతే ఏ సమయంలోనైనా నాకు ఫోన్ చేయవచ్చు, తక్షణమే స్పందిస్తాను‘ అని ఆయన భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మణికొండ మాజీ చైర్మన్ నరేందర్ ముదిరాజ్, మాజీ వైస్ ఛైర్మన్ నరేందర్రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్, మాజీ ఫ్లోర్ లీడర్ కె.రామకృష్ణారెడ్డి, స్థానిక నాయకులు జితేందర్, శ్రీరాములు, నీలేష్, కుమార్, హైమాంజలి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.