05-12-2025 06:45:31 PM
హన్మకొండ,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు శివ కుమార్ నాయుడు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరిష్ ల సమక్షంలో శుక్రవారం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ నిర్వహించారు.
ఈ ప్రక్రియను సాధారణ పరిశీలకులు, కలెక్టర్ లు నిశితంగా పరిశీలించారు. జిల్లాలోని భీమదేవరపల్లి, ఎల్కాతుర్తి, కమలాపూర్ మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓ.పీ.ఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు.
జిల్లాలోని మొదటి విడతలో గల 69 గ్రామ పంచాయతీల సర్పంచ్, 658 వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం 20 శాతం రిజర్వ్ స్టాఫ్ కలుపుకుని మొత్తం 761 ప్రిసైడింగ్ అధికారులు, 1149 ఓ.పీ.ఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించడం జరిగింది. ర్యాండమైజేషన్ ప్రక్రియలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జెడ్పి సీఈఓ రవి, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, తదితరులు పాల్గొన్నారు.