25-09-2024 02:44:07 AM
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 24: తనను పెళ్లి చేసుకుంటానని, యూట్యూబర్ హర్షసాయి లైంగిక దాడికి పాల్పడ్డాడని, అలాగే తన వద్ద నుంచి రూ.2 కోట్ల వరకు తీసుకుని ముఖం చాటేశాడని ఓ యువతి నార్సింగి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. హర్షసాయి పర్సనల్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నది.
రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ మంగళవారం రాత్రి వెల్లడించారు. ‘బిగ్ బాస్’ రియాల్టీ షోలో ఫేం సాధించిన ఓ యువతికి కొన్నేళ్ల క్రితం యూట్యూబర్ హర్షసాయి పరిచయమయ్యాడు. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఆమె వద్ద రూ.2 కోట్ల వరకు తీసుకున్నాడు. ఆ సొమ్మును పేదలకు పంచాడు. యూట్యూబ్‌లో వీడియోలు పెట్టి వ్యూస్ సాధించి సొమ్ము చేసుకున్నాడు. తర్వాత పెళ్లి చేసుకోమని యువతి నిలదీయగా ముఖం చాటేయడం ప్రారంభించాడు. అతడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె విసిగి వేసారింది.
చివరకు మంగళవారం రాత్రి తన న్యాయవాదులతో కలిసి నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. హర్షసాయితో పాటు అతడి తండ్రి రాధాకృష్ణపైనా ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమో దు చేసి వాంగ్మూలం తీసుకున్నారు. హర్షసాయిపై 376 (2), 376 (ఎన్), 354 బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతరం పోలీసులు బాధిత యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఓ ఆస్పత్రికి తరలించారు. హర్షసాయి ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో ‘మెగా’ అనే పేరుతో సినిమా తీస్తున్నాడు. చిత్రం ఎంత వరకూ వచ్చిందో తెలియదు. అతడిపై బెట్టింగ్ యాప్స్‌కు కూడా ప్రమోషన్ చేశాడనే ఆరోపణలూ గతంలో వినిపించాయి.