ఒంటరి పోరేనా?

26-04-2024 12:05:00 AM

2017 అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి వరుస ఓటమి

ఎస్పీకి వెన్నుదన్నుగా నిలిచిన ముస్లింలు, ఓబీసీలు

ఇప్పుడు ఎస్పీ నుంచి చేజారిన ఓబీసీ పార్టీలు

స్వయంకృతాపరాధమే అంటున్న ఓబీసీ నేతలు

ఎన్డీయే దగ్గరవుతున్న ఓబీసీ పార్టీల నేతలు

ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎస్పీ ప్రభావం అంతంత మాత్రమేనా?

యూపీలో ఒకప్పుడు కింగ్‌లా వెలిగిన ఎస్పీ


ప్రయాగ, ఏప్రిల్ 25 : ఉత్తరప్రదేశ్‌లో ఒకప్పుడు సమాజ్‌వాదీ పార్టీ అంటే ఎదురు ఉండేది కాదు. సీనియర్ రాజకీయ నేత ములాయంసింగ్ యాదవ్ స్థాపించిన ఈ పార్టీని ప్రస్తుతం యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ నడుపుతున్నారు. ముస్లింలు, ఓబీసీ వర్గాలే ఈ పార్టీకి వెన్నెముక. సమాజ్‌వాదీ పార్టీ నాలుగు సార్లు అధికారంలోకి వచ్చింది. మూడు సార్లు ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలో కాగా, ఒకసారి అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలో (2012 అధికారంలోకి వచ్చింది ఎస్సీ. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఘోర ఓటమి చవిచూసింది. 

దూరమైన ఓబీసీలు..

సాధారణంగా ఎస్పీకి వెన్నెముక ఓబీసీలు. 2022 ఎన్నికల్లో ఓబీసీ పార్టీల మద్దతు గణనీయంగా ఉండేది. రాష్ట్రీయ లోక్‌దళ్, సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, జనవాడీ సోషలిస్టు పార్టీ, అప్నాదళ్, మహాన్ దళ్ పార్టీలు ఎస్పీకి మద్దతుగా నిలిచాయి. దీంతో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఎస్పీకి చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఓట్లు వచ్చాయి. మొత్తం 403 అసెంబ్లీ సీట్లు ఉండగా.. ఎస్సీకి 11 సీట్లు, ఆర్‌ఎల్‌డీ 6 సీట్లు గెలుచుకుంది. బీజేపీ మాత్రం 255 సీట్లు సాధించి అధికారాన్ని దక్కించుకుంది. యోగి ఆదిత్య నేతృత్వంలో వరుసగా రెండు సార్లు పవర్‌లోకి వచ్చింది. ఇక 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ వేరేలా ఉంది. అప్పటి ఎన్నికల్లో ఎస్పీకి ఓబీసీ పార్టీల మద్దతు ఏ మాత్రం లేదు. అప్పుడు కూడా ఎస్పీతో కాంగ్రెస్ పార్టీ మాత్రమే పొత్తు పెట్టుకుంది. దీంతో ఎస్పీకి  దారుణంగా 47 సీట్లు మాత్రమే రాగా, కాంగ్రెస్‌కు 7 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. బీజేపీ మాత్రం 312 సీట్లు గెలుచుకుంది.

అసలు సవాల్ ఇప్పుడే.. 

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీకి ఓబీసీ పార్టీల మద్దతు కరువైంది. కేవలం మహాన్ దళ్ పార్టీ మాత్రమే బయటి నుంచి మద్దతు ఇస్తోంది. అది కూడా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే.. అంటే ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌తో మాత్రమే పొత్తు ఏర్పరచుకుంది. ఈ పొత్తుల్లో భాగంగా ఎస్పీ 63 ఎంపీ స్థానాలలో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 17 సీట్లలో బరిలో నిలవనుంది. 

హ్యాండిచ్చిన ఆర్‌ఎల్డీ..

పశ్చిమ యూపీలోని జాట్ వర్గంపై పట్టున్న ఆర్‌ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి.. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు క్రాస్ ఓటింగ్ చేశారు. ఇది ఎస్పీకి పెద్ద ఎదురుదెబ్బ. ఇక గతేడాది ఎస్‌బీఎస్పీ ఎన్డీయేలో భాగస్వామ్యమైంది. ఈ పార్టీ ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకాల్లో తలెత్తిన వివాదాల కారణంగా జన్ జన్వాడీ పార్టీ, అప్నా దళ్ (కె) కూడా ఎస్పీకి దూరంగా జరిగాయి. 

ఇదో వెరైటీ పొత్తు.. 

ఇక మహాన్‌దళ్ పార్టీకి ఓబీసీవర్గాలైన శక్యాలు, సైనీలు, కుష్వానాలు, మౌర్య వర్గాల్లో మంచి పట్టుంది. రెండు సీట్లు కావాలని ఎస్పీని ఆ పార్టీ అధ్యక్షుడు కేశవ్ దేవ్ మౌర్య కోరారు. అయితే ఎస్పీ అందుకు నిరాకరించడంతో బీఎస్పీని సంప్రదించారు. బీఎస్పీ కూడా అందుకు నిరాకరించడంతో గత్యంతరం లేక ఎస్పీకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే కాంగ్రెస్ పోటీ చేస్తున్న స్థానాల్లో బీఎస్పీకి మద్దతు ఇస్తామని కేశవ్ దేవ్ మౌర్య వెల్లడించారు. 

ఎస్పీ చేసుకున్నదేనా..?

ఎదురుగా ప్రత్యర్థి బలవంతుడైనప్పుడు కాస్త పట్టువిడుపులు ఉండాలంటారు. బలమైన ప్రత్యర్థిని ఓడించేందుకు అన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకోవాలి. కానీ ఈ విషయంలో ఎస్పీ ముందు చూపుతో వ్యవహరించలేదంటున్నారు పార్టీ కూటమిని వీడిన నేతలు. ఉదాహరణకు ఘోసి స్థానంలో చౌహాన్ వర్గానికి మంచి పట్టుంది. ఈ ప్రాంతం నుంచి తనకు సీటు ఇవ్వాల్సిందిగా జన జనవాడి పార్టీ అధ్యక్షుడు సంజయ్ చౌహాన్ ఎస్పీని కోరారు. అయితే అందుకు ససేమిరా అన్న ఎస్పీ.. రాజీవ్ రాయ్‌ను బరిలో దించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ స్థానాన్ని చౌహాన్ వర్గానికి చెందిన వారికి కాకుండా వేరే వారికి ఇస్తే పరోక్షంగా బీజేపీ గెలిచేందుకు దోహదపడినట్టేనని చెబుతున్నారు సంజయ్ చౌహాన్. అఖిలేశ్ యాదవ్ బీజేపీతో పోరాడకుండా.. తమతో పోరాడుతున్నారంటూ సంజయ్ మండిపడుతున్నారు.

దళిత వర్గాలూ దూరమేనా?

దళిత వర్గాలపై పట్టున్న ఆజాద్ సమాజ్ పార్టీతో కూడా ఎస్పీ చర్చలు విఫలమయ్యాయి. భీమ్ ఆర్మీ చీఫ్, ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ కూడా అయిన చంద్రశేఖర్ ఆజాద్ ఒంటరిగానే బరిలో నిలవాలని నిర్ణయించుకున్నారు. 2022 అసెంబ్లీ ఉప ఎన్నికలలో ఎస్పీ, ఆర్‌ఎల్డీ, ఏఎస్పీ కలిసి ఖతౌలీ, రాంపూర్ నుంచి పోటీ చేయగా, బీజేపీని సులువుగా ఓడించగలిగాయి. దళిత సామాజిక వర్గాల్లో పట్టున్న ఆజాద్.. ఎస్సీ రిజర్వ్‌డ్ అయిన నగినా లోక్‌సభ స్థానం కావాలని ఎస్పీని అడిగారు. అయితే అందుకు ఎస్పీ నిరాకరించింది. అందుకు బదులు ఆగ్రా, బులంద్ షహర్ ఇస్తామని చెప్పగా.. అందుకు ఆజాద్ నిరాకరించారు. దీంతో పొత్తు వీగిపోయింది. 

‘ఎస్పీకి ఆ పార్టీలు లెక్కే కాదు. వాటికి పెద్ద బలం లేదు. అయినా 3 నుంచి 5 లోక్‌సభ సీట్లు అడుగుతున్నాయి. వాటికి అన్ని సీట్లు ఇవ్వడం కుదరదు. ఇలాంటి పార్టీలు వస్తుంటాయి.. వాటి డిమాండ్లు తీర్చకపోతే బయటకు పోతుంటాయి.. అలాంటి పార్టీలు వెళ్లిపోవడంతో వచ్చే నష్టమేమీ లేదు’

- రాజేంద్ర చౌదరి, ఎస్పీ అధికార ప్రతినిధి