calender_icon.png 27 November, 2025 | 9:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ల స్వీకరణ సమర్థవంతంగా నిర్వహించాలి

27-11-2025 12:32:55 AM

-ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే 

-సమన్వయంతో ఎన్నికల నియమావళిని అమలు చేయాలి

కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికలలో భాగం గా నామినేషన్ల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీనారాయణలతో కలిసి జూమ్ మీటింగ్ ద్వారా మొదటి విడత మండలాలు అయిన లింగాపూర్, సిర్పూర్- యు, జైనూర్, కెరమెరి, వాంకిడి మండలాల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, జిల్లాలోని తహసిల్దారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఎస్. ఐ.లు, ఫ్లయింగ్, స్టాటిస్టిక్ సర్వేయలెన్స్ బృందాల సభ్యులతో నామినేషన్ ప్రక్రియ, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడతలో 5 మండలాలలో గల సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కొరకు 27 కేంద్రాలను ఏర్పా టు చేయడం జరిగిందని, ప్రతి నామినేషన్ స్వీకరణ కేంద్రానికి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారి ఉంటారని తెలిపారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 10:30 గంటలకు ముందే ఫారం 1 నోటీసు, ఫోటో ఓటర్ల జాబితా, స్థానాల వివరాలను నామినేషన్ల స్వీకరణ కేం ద్రం వద్ద ప్రదర్శించాలని తెలిపారు. ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించాలని, ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు ఉండకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. 

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు..

నామినేషన్ పరిశీలన, తుది అభ్యర్థుల జాబితా, గుర్తుల కేటాయింపు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. తహసిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పోలీస్ అధికారులు సమన్వయంతో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు. స్టాటిస్టిక్, ఫ్లయింగ్ సర్వేయలెన్స్ బృందాలు ఏర్పాటు చేయాలని, పోలింగ్ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. 3 విడతల ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా, వివాదాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేజ్ 1 రిటర్నింగ్ అధికారులు, హాయ్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.