27-11-2025 12:31:24 AM
పటాన్ చెరు, నవంబర్ 26 :హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి డాక్టరేట్ కు అర్హత సాధించారు. న్యూటోనియన్ కాని ద్రవాలలో వేడి, ద్రవ్యరాశి బదిలీ ప్రవాహ సమస్యల సంఖ్యా విశ్లేషణపై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణిత శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.గోవర్ధన్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.
డాక్టర్ శ్రీనివాసరెడ్డి అధ్యయనం వివిధ ఇంజనీరింగ్, పారిశ్రామిక ప్రక్రియలలో ముఖ్యమైన అనువర్తనాలను కలిగి ఉన్న న్యూటోనియన్ కాని ద్రవాల సంక్లిష్ట ప్రవర్తనపై విలువైన అంతర్దృష్టులను అందిస్తుందన్నారు.
ఈ సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మైలురాయి అత్యాధునిక పరిశోధన, విద్యా నైపుణ్యాన్ని పెంపొందించడంలో గీతం యొక్క దృఢమైన నిబద్ధతను ప్రస్ఫుటిస్తోందన్నారు.