11-10-2025 10:46:46 PM
రూ.2.80 కోట్లతో పట్టణ ప్రధాన రహదారుల పుననిర్మాణం..
సింగరేణి నిధులతో చేపట్టనున్నపనులు..
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): నియోజకవర్గ కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రధాన రహదారులను పుననిర్మించాలని, మరమత్తులు చేయాలని స్థానిక శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాంతో పలుమార్లు సమావేశమై రహదారుల సమస్యను వివరించడంతో పుననిర్మించాలని, మరమత్తులు చేపట్టేందుకు సింగరేణి యాజమాన్యం సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం పోస్టాఫీసు-రోడ్డు, సింగరేణి హాస్పిటల్ రోడ్డు, బస్టాండు-త్రిమాత టెంపుల్ రోడ్లను సింగరేణి, మున్సిపల్, విద్యుత్, భగీరథ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే కూనంనేని పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పోస్టాఫీసు సెంటర్ నుంచి హేమచంద్రాపురం వరకు, సింగరేణి ప్రధాన కార్యాలయం నుంచి సింగరేణి ప్రధాన ఆస్పత్రి, అదేవిధంగా సింగరేణి మెయిన్ స్టోర్స్ వరకు మూడు రోడ్లను యుద్ధ ప్రాతిపదికనే పుననిర్మాణ పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు.
ఈ మూడు రోడ్ల నిర్మాణం కోసం సంస్థ ద్వారా రూ.2.80కోట్లు మంజూరయ్యాయని, పనులను కొద్దిరోజుల్లోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కూనంనేని తెలిపారు. రెండో దఫాగా బస్టాండు సెంటరు నుంచి త్రిమాత టెంపుల్ వరకు రోడ్డు పుననిర్మాణం, రోడ్డు వెడల్పు, బస్టాండు గేట్ సెంటర్లలో హైమాస్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. సంస్థ ద్వారా నిధులు రాబట్టేందుకు నాలుగు నెలలుగా కృషి జరుగుతోందని, యాజమాన్యంపై వత్తిడి తెచ్చిన ఫలితంగా నిధులు మంజూరయ్యాయని తెలిపారు. రోడ్ల పరిశీలనలో కూనంనేని వెంట జిల్లా కార్యదర్శి ఎస్ కె షాబీర్ పాషా, నగర పాలక స్వస్థ కమిషనర్ సుజాత, సింగరేణి, ట్రాన్స్కో, మిషన్ భగీరథ అధికారులు సూర్యనారాయణ, రాజేంద్రప్రసాద్, సాంబశివరావు, రంగస్వామి, సాయి, ఏఐటీయూసీ, సిపిఐ నాయకులు వంగ వెంకట్, రత్నకుమారి, ధర్మరాజు, ముడెత్తుల శ్రీనివాస్, నిర్మల, భాగ్యలక్ష్మి, అమీర్ తదితరులు ఉన్నారు.