calender_icon.png 12 October, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్వాల్ డీసీపై చర్యకు రంగం సిద్ధం

12-10-2025 02:30:49 AM

  1. అక్రమంగా ఇంటి నంబర్లు కేటాయించినట్లు విజిలెన్స్ నివేదిక 
  2. జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్‌కు అందజేత

మేడ్చల్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): ఖాళీ స్థలానికి ఇంటి నంబర్లు కేటాయించిన కేసులో అల్వాల్ డీసీ శ్రీనివాస్‌రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు విజయక్రాంతి దినపత్రికలో ఈ నెల 6వ తేదీన ‘లేని ఇళ్లకు ఇంటి నంబర్లు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి అధికారులు స్పందించారు. డీసీ శ్రీనివాస్‌రెడ్డి అక్రమంగా ఇంటి నంబర్లు కేటాయించినట్లు విజిలెన్స్ అధికారులు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్‌కు నివేదిక సమర్పించారు. దీంతో డీసీపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

అల్వాల్‌లో 573 సర్వే నెంబర్‌లో 3.24 ఎకరాలు, 574 సర్వే నెంబర్‌లో ఐదు ఎకరాలు నిమ్మ మోహన్‌రెడ్డి అనే వ్యక్తి 2003, 2004 సంవత్సరాలలో చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. అప్పటినుంచి భూమి ఆయన స్వాధీనంలో ఉంది. మామిడి జనార్దన్‌రెడ్డి అనే వ్యక్తి 573/2, 574/2 సర్వే నెంబర్లలో 3.30 ఎకరాల భూమి ఉందని పలుమార్లు అంగ బలం, ఆర్థిక బలంతో కబ్జాకు ప్రయత్నించాడు.

దీనిని నిమ్మ మోహన్‌రెడ్డి అడ్డుకున్నాడు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ అసెస్మెంట్‌ను ఆసరా చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జనార్దన్‌రెడ్డి స్కెచ్ వేశాడు. దీనికి జిహెచ్‌ఎంసి అధికారులు సహకరించారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూమికి సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా పది పెద్ద భవనాలు ఉన్నట్లు, వాటిలో 80 ప్లాట్లు ఉన్నట్లు ఇంటి నంబర్లు ఇచ్చారు. వీటికి డీసీ శ్రీనివాసరెడ్డి ప్రాపర్టీ టాక్స్ కేటాయించారు. బాధితుడు నిమ్మ మోహన్‌రెడ్డి జిహెచ్‌ఎంసి కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రాపర్టీ టాక్స్, ఇంటి నంబర్లను కమిషనర్ కర్ణన్ రద్దు చేశారు. ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.