calender_icon.png 12 October, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

13న బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం

12-10-2025 02:25:23 AM

  1. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా వ్యూహం
  2. రెహమత్‌నగర్‌లో 5 వేల మందితో నిర్వహణ
  3. గులాబీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం 
  4. హాజరు కానున్న మాజీ మంత్రి హరీశ్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు
  5. ఇదే వేదిక నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం

హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీఆర్‌ఎస్ ఉవ్విళ్లూరుతున్నది. పార్టీకి అత్యంతపట్టు ఉన్న నియోజకవర్గంలో ఈసారి కూడా పాగా వేయాలని పావులు కదుపుతున్నది. గెలుపే లక్ష్యంగా పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నది. దీనిలో భాగంగానే ఈ నెల 13న నియోజకవర్గ పరిధిలోని రెహమత్‌నగర్‌లో సుమారు 5 వేల మందితో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నది. సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, పలువురు సీనియర్ నాయకులు హాజరుకాను న్నారు.

ఎన్నికల వ్యూహాన్ని పార్టీ శ్రేణులకు వివరించనున్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే వేదిక నుంచే బీఆర్‌ఎస్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

బూత్, డివిజన్‌స్థాయి ఇన్‌చార్జ్‌లు

మునుగోడు ఉప ఎన్నికలో అనుసరించిన విధంగా గడప గడపకూ వెళ్లి గులాబీ శ్రేణులు ఓటు అభ్యర్థించేలా ఏర్పాట్లు చేసింది. పక్కా గెలుపు కోసం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులను సైతం రంగంలోకి దించుతున్నది. పది పోలింగ్ కేంద్రాలకు ఒక్క ఇన్‌చార్జ్ చొప్పున నియమిస్తున్నది.  వీరు ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు అయిఉండొచ్చు. అలాగే డివిజన్, బూత్ స్థాయిలోనూ పార్టీ ఇన్‌చార్జులను నియమించింది. అసెంబ్లీ స్థానంలో ముస్లింల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆయా వర్గానికి చెందిన నాయకులకే పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించింది. సోమవారం ఇక పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలను ఓట్లను అభ్యర్థించనున్నాయి.

ప్రచారానికి రంగం సిద్ధం

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జూబ్లీహిల్స్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ఖరారు చేసిన విషయం తెలిసిందే. మాగంటి సునీత బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రచారాన్ని వేగవంతం చేసే దిశగా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తుంది. దీనిలో భాగంగానే నందినగర్‌లో పార్టీ వార్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు, ఇక్కడి నుంచే పార్టీ ప్రచార సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నట్లు తెలిసింది. నియోజకవర్గంలో ఉదయం, సాయంత్రం రెండు పూటలా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో వార్ రూం కీలకంగా వ్యవహరించనున్నది.

దీంతోపాటు నాయకులందరూ ప్రతి ఓటర్ వద్దకూ వెళ్లాలని ఆదేశాలు జారీ అయ్యా యి. ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచిస్తున్నారు. అయితే జూబ్లీహిల్స్ ప్రచా రం కోసం బీఆర్‌ఎస్ ప్రచారం ఇప్పటికే సిద్ధమైంది. సోమవారం రెహమత్ నగ ర్ సమావేశం తర్వాత పార్టీ ఎన్నికల ప్రచా రం మొదలుకానున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు రోడ్ షోలో పాల్గొననున్నారు. అయిఏత.. పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వస్తారా.. లేక రావడం లేదా? అన్న అంశంపై మాత్రం సందిగ్ధత నెలకొంది.