11-10-2025 11:01:09 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): తప్పుడు కేసుల వల్ల మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న బీజేపీ వేమనపల్లి మండల పార్టీ అధ్యక్షులు ఏట మధుకర్ కుటుంబాన్ని శనివారం రాత్రి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. మధుకర్ ఆత్మహత్యకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముందుగా ఏట మధుకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వ్యక్తులందరిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మృతుడు ఏట మధుకర్ బీజేపీ పార్టీలో క్రియాశీలక సభ్యునిగా పనిచేశారని చెప్పారు. మృతుని కుటుంబానికి బీజేపీ పార్టీ పూర్తి అండగా నిలుస్తుందని, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. కేంద్రమంత్రి బండి సంజయ్ వెంట బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్, బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి కొయ్యల ఎమాజీతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.