16-06-2025 01:51:12 AM
తెలంగాణలో సైబర్ బాధితులకు రూ.53 కోట్ల ఆర్థిక స్వాంతన: డీజీపీ జితేందర్
హైదరాబాద్, సిటి బ్యూరో జూన్ 15 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని ఆర్థికంగా నష్టపోయిన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక స్వాంతన చేకూర్చింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, రాష్ర్ట న్యాయ సేవల ప్రాధికార సంస్థల ఆధ్వర్యంలో జరిగిన రెండో జాతీయ మెగా లోక్‌అదాలత్‌లో, సైబర్ మోసాలకు గురైన 6,848 మంది బాధితులకు రూ.53 కోట్లకు పైగా నిధులు తిరిగి అందాయి.
ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ జితేందర్ డీఐజీ, ఎస్‌సీఆర్‌బీ, డీఎస్‌పీ ఎస్‌సీఆర్‌బీ, ఎస్‌సీఆర్‌బీ బృందాలు, అలాగే ఏడీజీపీ సీఐడీ చారు సిన్హా సారథ్యంలో అద్భుతంగా సమన్వయం చేసిన యూనిట్ అధికారులను, అన్ని జిల్లాల సీపీలు, ఎస్పీలు, బృందాలను అభినందనలు తెలిపారు. జూన్ 14న జరిగిన ఈ లోక్ అదాలత్‌లో ఒకే రోజులో ఏకంగా రూ.15.79 కోట్లను సైబర్ మోసాల బాధితులకు తిరిగి చెల్లించడానికి ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ ఏడాది మార్చి 8న జరిగిన మొదటి మెగా లోక్‌అదాలత్‌లో రూ14.3 కోట్లను 3,527 మంది బాధితులకు తిరిగి చెల్లించారు. తాజా రికవరీతో కలిపి, ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.97.18 కోట్లను 11,832 మంది సైబర్ మోసాల బాధితులకు తిరిగి చెల్లించినట్టుంది. 2024, ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.281.1 కోట్లను 30,478 మంది సైబర్ క్రైమ్ బాధితులకు తిరిగి చెల్లించారు.
అత్యధిక నిధులు తిరిగి రాబట్టిన యూనిట్లు
* హైదరాబాద్: 782 కేసులు, రూ.14.54 కోట్లు
* సైబరాబాద్: 2,997 కేసులు, రూ.13.81 కోట్లు
* రాచకొండ: 1,005 కేసులు, రూ 11.01 కోట్లు
* సంగారెడ్డి: 163 కేసులు, రూ 1.62 కోట్లు
* వరంగల్: 250 కేసులు, రూ.89 లక్షలు