06-12-2025 12:23:45 AM
-స్థానిక ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు
-సర్పంచి, వార్డు స్థానాలకు దాఖలు కానీ నామినేషన్లు
చారకొండ, డిసెంబర్ 5: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మండలంలోని గోకారం వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించి తమ గ్రామాలను ముంపు నుంచి తప్పించాలని, ప్రభుత్వం జారీ చేసిన ఆర్&ఆర్ జీవో రద్దు చేయాలని కోరుతూ స్థానిక ఎన్నికలను బహిష్కరించి మండలంలోని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా ప్రజలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాలుగో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి న్యాయ పరమైన జీవో ఇచ్చేవరకు ఎన్నికలను బహిష్కరించి పోరాటాన్ని శాంతియుతంగా మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. నిరాహార దీక్షలో ప్రకాశ్, నాగయ్య, రెడ్యా నాయక్, రాములమ్మ, సురిగి వీరయ్య, అల్వాల బాలయ్య, అల్వాల చంద్రయ్య, అంజయ్యతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.
దాఖలు కానీ నామినేషన్లు..
పంచాయతీ ఎన్నికలు బహిష్కరించాలని ఎర్రవల్లి గ్రామస్తులు నిర్ణయం తీసుకోవడంతో నామినేషన్ల వేయడానికి ఎవరు ముందుకు రాలేదు. నామినేషన్లకు చివరి రోజు వరకు ఎర్రవల్లి గ్రామ పంచాయతీ నుంచి సర్పంచి, వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడ దాఖలు కాలేదని గోకారం క్లస్టర్ ఎన్నికల అధికారి వై. రామకృష్ణ తెలిపారు.