05-07-2025 12:00:00 AM
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్,జూలై4 (విజయ క్రాంతి) పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా బాధితులకు పోరాట లభిస్తుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం పరిధిలోని వీణవంక మండలంలో శుక్రవారం 18 గ్రామాల్లోని 69 మంది లబ్ధిదారులకు రూ.14,88,500 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను వారి ఇంటికే వెళ్లి స్వయంగా లబ్ధిదారులకు అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు సీఎంఆర్‌ఎఫ్ పరిమిత స్థాయిలోనే ఉండేదని. కేసీఆర్ సీఎం అయిన తరువాత బడ్జెట్ పెంచి సీఎంఆర్‌ఎఫ్ ను ప్రజలకు మరింత ప్రయోజనకరంగా మార్చారని అన్నారు. వేలాది మంది ఈ నిధి ద్వారా లబ్ధి పొందుతున్నారుఅనిపేర్కొన్నారు. కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించిన చెక్కులను త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
తులం బంగారం ఏమైంది ముఖ్యమంత్రి?
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.తులం బంగారం పథకం ఎక్కడికి చేరింది? కాలేశ్వరం ప్రాజెక్టును నిలిపివేయడం వల్ల రైతులు నీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. రైతు భరోసా అందరికీ అందడంలేదని,ఉచిత బస్సు వాగ్దానం చేసినా, బస్సులు పెంచకపోవడం వల్ల మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు అసౌకర్యానికి గురవుతున్నారుఅని వాపోయారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, అక్రమ కేసులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని స్పష్టం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిచెప్తారనిహెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ వాలా బాలకిషన్ రావు, మాజీ ఎంపీపీ రేణుక తిరుపతి రెడ్డి, మాజీ జడ్పీటీసీ వనమాల సాదవ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి, బీఆర్‌ఎస్ మండల నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.