3 July, 2026 | 1:05 AM

డంపింగ్ యార్డ్‌ను ఎత్తివేయండి

03-07-2026 12:00 AM
  1. పర్యావరణాన్ని పరిరక్షించండి                    
  2. కాలుష్యం కోరల నుండి జవహర్‌నగర్‌ను రక్షించండి           
  3. ఆర్.ఎస్.పి జాతీయ నేత జానకిరామ్     

జవహర్ నగర్, జూలై 2 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు జీవించే హక్కును రక్షించండి అని, కాలుష్యం కోరల నుండి జవహర్ నగర్, దాని చుట్టుపక్కల ప్రాంతాలను కాపాడాలని  ఆర్. ఎస్. పి జాతీయ నేత జానకిరామ్ డిమాండ్ చేశారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప లో జవహర్ నగర్ డంపింగ్ జేఏసీ చైర్మన్ షేక్షావలి, దమ్మాయిగూడ జేఏసీ అధ్యక్షుడు సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్. ఎస్. పి జాతీయ నేత జానకిరామ్ హాజరై మాట్లాడుతూ, భరించలేని దుర్గంధాన్ని  విడుదల చేస్తున్న రాంకీ డంపింగ్ యార్డ్ ను  తొలగించే వరకు ఉద్యమిద్దమని పిలుపునిచ్చారు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల ప్రత్యక్షంగా 20 లక్షల మంది పరోక్షంగా 30 లక్షల మంది ప్రజల పాలిట శాపంగా ప్రమాదకరంగా మారిందని అన్నారు.  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం డంపింగ్ యార్డ్ ఎత్తివేతకు సముఖంగా ఉన్నారని అన్నారు.

అనంతరం స్థానిక నేత మాజీ ఉపసర్పంచ్ నరసింహ గౌడ్ నాయకత్వాన కలుషితమైన చెరువును గుట్టలను తలపిస్తున్న చెత్త డంపింగ్ యార్డును జానకిరామ్  పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం టి శివన్నారాయణ, గడ్డం సదానందం, ఏ. సుబ్రహ్మణ్యం, పెరిక సునీత, వి. ప్రవీణ్, సూర్య, వెంకటయ్య, లక్ష్మీబాయి, నాగారం అశోక్, రాజీవ్ గృహకల్ప ప్రెసిడెంట్  నరసింహ, ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేష్, విజయ్, కుమార్, జాన్, వినయ్, కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ నేత శ్వేతా ముదిరాజ్  తదితరులు  పాల్గొన్నారు.