15-07-2025 12:12:45 AM
కామారెడ్డి, జూలై 14 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేవుతోంది. రెండు రోజులుగా అటవీశాఖ అధికారులు పెద్ద పులి జాడ కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. డ్రోన్లు, ట్రాక్ కెమెరాలతో పులి జాడ కోసం ఉమ్మడి జిల్లా అటవీశాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పులిపై విషప్రయోగం జరిగిందన్న ప్రచారం అటవీశాఖ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
పులి బతికే ఉందా.. చనిపోయిందా అనే అనుమానాలు అటవీశాఖ అధికారులను వెంటాడుతున్నాయి. పులి జాడ తెలిస్తే తప్ప అధికారులకు కంటిమీద కునుకు ఉండే అవకాశాలు లేవన్న ప్రచారం సాగుతోంది. కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల సరిహద్దులో అటవీ ప్రాంతం ఉండడంతో పెద్దపులి జడ కోసం రిస్క్యూటివ్ వేట ప్రారంభించింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డి పేట తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో
పెద్దపులి సంచారం విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఆదివారం ఉదయం నుంచి అడవిలో రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ, ఇందల్వాయి, కామారెడ్డి నుంచి మూడు బృందాలు పులికోసం అడవిని జల్లెడ పడుతున్నారు. అడవిలో ఆరు ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం రెండు డ్రోన్ కెమెరాలతో అడవి మొత్తం గాలిస్తున్నారు.
రెడ్డిపేట తండాకు చెందిన రైతు మహిపాల్ కు చెందిన ఆవుపై పెద్దపులి దాడి చేసింది. దీంతో అతను ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు ఆదివారం ఉదయమే తండా ప్రాంతంలో పులి పాదముద్రలు సేకరించి పెద్దపులి సంచరిస్తున్నట్లుగా నిర్ధారించుకు న్నారు. పెద్ద పులి సంచరించిన ప్రాంతం మాచారెడ్డి రేంజ్ ఎల్లంపేట ఫారెస్ట్ సెక్షన్ పరిధిలో ఉందని అధికారులు చెబుతున్నారు.
అయితే పులిపై విషప్రయోగం జరిగిందనే ప్రచారంతో అసలు పులి బతికే ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆవుపై పులి మరోసారి దాడి చేయకపోతే జిల్లా శివారు దాటి ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. శివారు దాటితే మాత్రం అధికారులు ఊపిరి పీల్చుకునే అవకాశాలు ఉన్నాయి.
రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది: డిఎఫ్‌ఓ నిఖిత
పెద్దపులి ఆవుపై దాడి చేసిందని సమాచారం రాగానే మా అధికారులు, సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. వారం రోజుల క్రితమే సిరికొండ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్టుగా పాదముద్రలు బయటపడడంతో అన్ని ఏరియా అధికారులను అప్రమత్తం చేశాం. ప్రస్తుతం మూడు బృందాలు పెద్దపులి కోసం వెతుకుతున్నాయి. ఇప్పటికే పులిని గుర్తించేందుకు ఆరు ట్రాక్ కెమెరాలను అమర్చాం.
రెండు డ్రోన్ కెమెరాలతో సెర్చ్ చేస్తున్నాం. పులిపై విషప్రయోగం జరిగిందనేది స్పష్టంగా చెప్పలేం. ఆవుపై మందు చల్లానని మహిపాల్ అనే వ్యక్తి ఒప్పుకున్నాడు. శాంపిల్ సేకరించి ఫోరెన్సిక్ కు పంపించాం. పులికి ఏమి జరిగి ఉండదని భావిస్తున్నాం. గత 40-50 ఏళ్లుగా జిల్లాలో పెద్దపులి సంచారం లేదు. చిరుతలు, ఎలుగుబంట్లు మాత్రమే ఉన్నాయి.
పెద్దపులి వస్తే దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ప్రజలెవరూ అడవి వైపు వెళ్లొద్దని సమాచారం తెలియజేశాం. పులి కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వాల అని పలు గ్రామాల ప్రజలకు సమాచారం ఇచ్చినట్లు ఆమె తెలిపారు.