15-07-2025 12:33:10 AM
వృత్తిని నమ్ముకున్న మార్కెట్ డైరెక్టర్లు!
మహబూబాబాద్, జూలై 14 (విజయ క్రాంతి): చిన్నపాటి పదవి వస్తేనే డాబు దర్పం ఒలకబోసే ఈ రోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతిష్టాత్మక మార్కెట్ గా గుర్తింపు పొందిన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా నియమితులైన ఇద్దరు తాము చేపట్టిన వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేసముద్రం పట్టణానికి చెందిన ఎండీ అయ్యుబ్ ఖాన్, దన్నసరికి చెందిన చింతకుంట్ల యాదగిరి కొద్ది నెలల క్రితం మార్కెట్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు.
అయితే ఇందులో అయ్యుబ్ ఖాన్ టైలర్ గా వృత్తి కొనసాగిస్తుండగా, యాదగిరి రైల్వే స్టేషన్ వద్ద మోటార్ సైకిల్ స్టాండ్ నిర్వహకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అనేక సంవత్సరాలుగా తమ వృత్తిని కొనసాగిస్తూనే.. కాంగ్రెస్ పార్టీనీ నమ్ముకొని సేవ చేస్తుండగా మార్కెట్ డైరెక్టర్ పదవి ఇచ్చినప్పటికీ, ఆ పదవులు ‘నాంకే వాస్తే’ మారాయని, ఆ పదవుల వల్ల పెద్దగా ప్రాముఖ్యత, ఫాయిదా లేదని పెదవి విరిచారు. కుటుంబ పోషణ కోసం తమ వృత్తిని యధావిధిగా కొనసాగిస్తూన్నామని అయ్యుబ్ ఖాన్, యాదగిరి చెప్పారు.