15-10-2025 01:30:11 AM
సూర్యాపేట, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ధర్మబిక్షం భవనంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అన్ని రంగాలలో 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ర్ట ప్రభుత్వం అసెంబ్లీలో, శాసనమండలిలో అన్ని పార్టీల మద్దతుతో ఏకగ్రీవ తీర్మానం జరిపి 9 జీవో తీసి గవర్నర్ కి ఆమోదించడానికి పంపిన బిల్లుని ఆమోదించకుండా బిజెపి అడ్డుకోవడం దుర్మార్గం అని అన్నారు.
చట్టసభల్లో ఆమోదించిన బిజెపి, బీఆర్‌ఎస్ పార్టీలు రిజర్వేషన్ అమలు అయితే తమ రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదం అని భావించి ప్రజల మధ్య డ్రామాలు ప్రదర్శించి బిల్లును ఆమోదించకుండా కోర్టుల ద్వారా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే బీసీల అగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. బిజెపి, బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులంతా వారిపై ఉన్న నాయకత్వానికి భయపడి బీసీ 42% బిల్లుని అడ్డుకుంటే భవిష్యత్తు తరాలు క్షమించరనీ వెల్లడించారు.
ఇప్పటికైనా కళ్ళు తెరిచి వారి నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి బిల్లును ఆమోదింప చేయాలని వారికి హితువు పలికారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు 42%ను ఆమోదించాలని అన్ని మండల, కేంద్రాలల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే గురువారం జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి అన్ని వర్గాల బీసీ సంఘాలు మద్దతు తెలిపి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి భూరా వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ అనంతల మల్లేశ్వరి పాల్గొన్నారు.